Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు అడ్డంప‌డుతున్న మోడీ

By:  Tupaki Desk   |   30 Oct 2015 12:58 PM GMT
చంద్ర‌బాబుకు అడ్డంప‌డుతున్న మోడీ
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ గా కొత్త రాష్ర్టంగా ఏర్ప‌డిన త‌ర్వాత ఆ రాష్ర్టం అభివృద్ధికి ఇతోధికంగా స‌హ‌క‌రించాల్సిన కేంద్రం ప్ర‌భుత్వం త‌న నిబంధ‌నల‌తో మోకాలు అడ్డంపెడ్తోందా? ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధికి ఇపుడు కేంద్రం విధిస్తున్న నిబంధ‌న‌లు తీవ్ర ఇబ్బందిగా మారాయా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విధించిన నిబంధనలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అడ్డంకిగా మారాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రూపొందించి విశిష్ట పారిశ్రామిక విధానమై సింగిల్‌ డెస్క్‌ కు చిక్కులు ప‌డ్డాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌ 29న విశాఖపట్నంలో 2015-20 సంవత్సరాలకు పారిశ్రామిక డెవలప్‌ మెంట్‌ పాలసీ(ఐడిపి)ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 21 రోజుల్లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాల అనుమతులిచ్చేలా తీసుకువ‌చ్చిన ఈ విధానం పారిశ్రామిక అధిపతులు, ఐటి కంపెనీల ప్రతినిధులు, అధికార యంత్రాంగం సమక్షంలో అట్టహాసంగా ఈ కార్య‌క్ర‌మం జ‌రిగి నేటికి ఆరు నెల‌లైంది. అయితే పరిశ్రమలు పెట్టుకోవడానికి ముందుకెళ్లే ఔత్సాహికులకు బ్యాంకుల్లో పైసా సబ్సిడీ ఇవ్వ‌డం లేదు. ఇందుకు కేంద్రం నిబంధ‌న‌లు అడ్డంకిగా మారుతున్నాయి.

ప్ర‌భుత్వంతో పారిశ్రామిక ఔత్సాహికవేత్తల మెమోరాండం అనే అంశం గతంలో మొదటి భాగం(పార్ట్‌1)లో ఉండేది. ఈ ఒప్పందంలో భాగంగా ఆయా కంపెనీలు - ప్ర‌భుత్వం మ‌ధ్య కుదిరి ఒప్పందం గురించిన వివ‌రాల‌న్నీ పొందుప‌ర్చేవారు. పరిశ్రమలను స్థాపించదలిచిన ఔత్సాహికులు ఈ ఎంఓయూను బ్యాంకులో అందజేస్తే రుణం - ప్రభుత్వ సబ్సిడీ - అన్ని రాయితీలూ అందేవి. కేంద్ర ప్రభుత్వం తాజా పారిశ్రామిక పాల‌సీలో దీన్ని తొలగించింది. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తూచ తప్పకుండా అనుసరించాలన్నది కేంద్ర పారిశ్రామిక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. బ్యాంకర్లు పార్టు-1ను కచ్చితంగా అడుగుతుండడంతో చిన్న -కుటీర పరిశ్రమల స్థాపనకు ఆటంకాలేర్పడ్డాయి.

సదరు కంపెనీలు ఈ నిబంధనలను అనుసరించకపోతే పరిశ్రమలకు అనుమతులు రాని ప‌రిస్థితినెల‌కొని ఉంది. పార్టు-1 ప్రకారం పారిశ్రామిక ఔత్సాహికులు ప్రభుత్వం మంజూరు చేసే రకరకాల సబ్సిడీలను, రాయితీలను ముందే పొందేవారు. ఇప్పుడా నిబంధనను కేంద్రం తీసివేయ‌డం వ‌ల్ల ఆ మొత్తాన్ని న‌ష్ట‌పోవాల్సి వ‌స్తోంది దీంతో ఆయా కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. ఈ స‌మ‌స్య వల్ల 47 పెద్ద కంపెనీలతో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల అమలు కూడా పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది.

న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఏపీలో పెట్టుబ‌డుల‌ను పెద్ద ఎత్తున ప్ర‌భావితం చేస్తోంద‌ని ప‌ల‌వురు అంచ‌నా వేస్తున్నారు. ఇదిలాఉండ‌గా...కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌త్యేకంగా విన‌తి పత్రం అంద‌జేసి పార్ట్‌1కు మిన‌హాయింపు ఇచ్చేలా లేదా సొంత నిబంధ‌న‌లు రూపొందించుకునేలా ప్ర‌భుత్వ అధికారులు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తున్నార‌ని తెలుస్తోంది.