Begin typing your search above and press return to search.

టీడీపీతో పొత్తుపై తేల్చేసిన మోడీ...

By:  Tupaki Desk   |   16 Dec 2021 11:30 PM GMT
టీడీపీతో పొత్తుపై తేల్చేసిన మోడీ...
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆంధ్రాలో అయితే ఆ పార్టీ నోటాతో పోటీ పడాల్సిన దుస్థితిలో ఉంది. ఈ క్రమంలోనే వచ్చే సాధారణ ఎన్నికలు మరో రెండున్నర సంవత్సరాలు ఉన్నవేళ... ప్రధానమంత్రి మోడీ రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలపై ఫోక‌స్‌ పెట్టారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీ, తెలంగాణలో పార్టీని ఎలా ? బలోపేతం చేయాలి.. భవిష్యత్ ఏంటి అనేదానిపై రెండు రాష్ట్రాల్లో బిజెపి నేతలకు దిశానిర్దేశం చేశారు. కర్ణాటక - తెలంగాణ - ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీలకు మోదీ త‌న నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఆయన మూడు రాష్ట్రాల వారీగా పరిస్థితులు ఎలా ఉన్నాయి ? అనే దానిపై ఆరా తీసినట్లు తెలిసింది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు మూడు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైనే ఉందని మోదీ సూచించారట‌.

ఇప్పటికే ఉత్తరాదిలో అన్ని రాష్ట్రాల్లోనూ బలమైన ముద్ర వేసుకున్న బిజెపి... దక్షిణాది రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో బలోపేతం కావడం లేదన్న బాధ కేంద్ర నాయకత్వానికి ఉంది. తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్... ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉన్న టిడిపి క్షేత్ర స్థాయిలో పట్టు కోల్పోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ గ్యాప్ ఫిల్ చేసుకుని.. రాజకీయంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేసినట్టు తెలిసింది.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లోనూ మనకు మంచి అవకాశాలు ఉన్నాయని... రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం అయ్యేందుకు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ నెల 28న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు కేంద్ర మంత్రులు కూడా కానున్నారు.

ఇక తెలంగాణలో ఇప్పటికే టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అన్నట్టుగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయని... ఏపీలో వైసీపీ వ‌ర్సెస్ బీజేపీ అన్నట్టుగా అక్కడ బలపడాలని ప్రధాని సూచించినట్టు తెలిసింది. టీడీపీతో పొత్తుపై రకరకాల ఊహాగానాలు వస్తున్న ప్రధానితో సమావేశం అనంతరం బిజెపి నేతలు కొందరు మాట్లాడుతూ... టిడిపితో సంబంధాలు భవిష్యత్తులో కూడా ఉండ‌వ‌ని మోదీ క్లారిటీ ఇచ్చినట్టుగా చెప్పారు. దీంతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... ఆ ప్రయత్నాలకు మోడీ అయితే పులిస్టాప్ పెట్టేశారు.