Begin typing your search above and press return to search.

ఈ ఏడాది చివరి నమో ‘‘మనసు మాట’’

By:  Tupaki Desk   |   27 Dec 2015 9:27 AM GMT
ఈ ఏడాది చివరి నమో ‘‘మనసు మాట’’
X
‘‘2015లో ఇది ఆఖరి మన్ కీ బాత్ ప్రోగ్రాం. 2016లో మళ్లీ తిరిగి మన్ కీ బాత్ ప్రారంభిస్తాం. తొలి నుంచి ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న వారికి ధన్యవాదాలు’’ అంటూ ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ కార్యక్రమం గురించి చెప్పుకొచ్చారు ప్రధాని నరేంద్రమోడీ. ఎప్పటి మాదిరే తాజా మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ కొన్ని స్ఫూర్తివంతమైన కథనాలు.. మంచి విషయాలు.. భారతదేశం ఎలా ఉంది? ఎలా మార్చాలి? భవిష్యత్తులో ఏమేం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి ఏం చేయగలిగాం? లాంటి విషయాల్ని మోడీ ప్రస్తావించారు.

తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎవరో ఒక (అ)సామాన్యుల విజయగాథల్ని ప్రస్తావించే ప్రధాని మోడీ తాజా కార్యక్రమంలో మధ్యప్రదేశ్ లోని సిశోర్ జిల్లాలోని భోజ్ పురా గ్రామానికి చెందిన దిలీప్ సింగ్ మాలవియా అనే వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు. పైసా తీసుకోకుండా ఇతరుల సాయంతో 100 టాయిలెట్లను నిర్మించిన అతని ఉదంతాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. దిలీప్ సింగ్ మాలవియా చేసిన పని తనను ఎంతో ప్రభావితం చేసిందన్న మోడీ.. ఇప్పటికే సాధించిన కొన్ని విజయాల్ని ప్రస్తావించారు. గతంలో బ్యాంకుల గురించి ఆలోచించని సామాన్య పౌరుడు.. ఇప్పుడు బ్యాంకుకు వెళ్లి ముద్రా పథకం ద్వారా లోన్లు పొందుతున్న విషయాన్ని గుర్తు చేశారు. 1000 రోజుల్లో ప్రతి గ్రామానికి విద్యుత్తు ఇస్తామని ప్రమాణం చేశామని.. దాని ప్రకారమే విద్యుత్తు ఇస్తున్నట్లు చెప్పారు. భారతీయ యోగా ప్రపంచ దేశాల్ని ఆకర్షించిందని.. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పాటిస్తుంటే.. భారతీయ శక్తి పట్ల మరింత విశ్వాసం కలుగుతుందని వ్యాఖ్యలు చేశారు.

దేశంలోని జీవన వైవిధ్యాన్ని ప్రస్తావించిన మోడీ.. రెండు రోజుల క్రితమే క్రిస్మస్ ను ఘనంగా జరుపుకున్నామని.. ఇప్పుడు న్యూఇయర్ వేడుకులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నామని వ్యాఖ్యానించారు. అతిథి దేవోభవ అనే మనం.. మన ఇంటికి అతిధుల్ని ఆహ్వానించే ముందు మన ఇంటిని శుభ్రంగా ఉంచుకొని అలంకరించుకుంటామని.. పరిశుభ్రతను పాటించటం ద్వారా దేశ పర్యాటకం అభివృద్ధి చెందుతుందని.. భారత ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా వెలుగొందుతుందంటూ వ్యాఖ్యానించారు.