Begin typing your search above and press return to search.

చిరాగ్ ను ఆటలో అరటిపండును చేసిన మోడీ

By:  Tupaki Desk   |   8 July 2021 9:00 PM IST
చిరాగ్ ను ఆటలో అరటిపండును చేసిన మోడీ
X
దేశంలోనే అత్యంత బలవంతుడు ఎవరు అంటే ఠక్కున సమాధానం చెప్పొచ్చు. అది ప్రధాని నరేంద్రమోడీ అని.. దేశంలో ఏం చేయడానికైనా ఆయన నిర్ణయం తీసుకోవచ్చు. ఒక రూలర్ అనుకోవచ్చు. అలాంటి మోడీనే బ్లాక్ మెయిల్ చేస్తే ఏమవుతుంది? చిరిగి చాటవుతుంది. ఇప్పుడు లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ పని అలానే అయ్యింది. మోడీ ముందు చిరాగ్ ఆటలు సాగలేదు. చిరాగ్ కే చినిగిపోయేలా మోడీ షాక్ ఇచ్చాడు.

కొద్దిరోజులుగా బీహార్ కు చెందిన చెందిన ఎల్జేపీ పార్టీలో అసమ్మతి చెలరేగిన సంగతి తెలిసిందే. పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన ఎంపీ చిరాగ్ పాశ్వాన్ ను దింపేసి ఆయన సొంత బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ ను అధ్యక్షుడిగా ఎంపీలతో ఎన్నికున్నారు. చిరాగ్ ను బయటకు పంపారు. అయితే చిరాగ్ మాత్రం వారందరినీ తొలగిస్తూ పార్టీ తనదే అన్నారు.

ఈ విషయంలో బాబాయ్-అబ్బాయి మధ్య పెద్ద గొడవలే జరిగాయి. పార్లమెంట్ లోనూ చిరాగ్ ను తొలగించి ఎంపీలు పశుపతిని లోక్ సభపక్ష నేతగా ప్రకటించారు. లోక్ సభ స్పీకర్ సైతం పశుపతినే గుర్తించారు. దీనిపై చిరాగ్ ప్రధాని మోడీ, అమిత్ షాలను కోరినా వారు పట్టించుకోలేదు. తననే గుర్తించాలని పశుపతితో బీజేపీ పొత్తు పెట్టుకోవద్దని చిరాగ్ స్వరం పెంచాడు.

రెండు రోజుల క్రితం ఏకంగా మోడీకే హుకూం జారీ చేశారు. కేంద్రమంత్రివర్గంలోకి పశుపతిని తీసుకుంటే తాను కోర్టులో కేసు వేస్తానని మోడీని చిరాగ్ హెచ్చరించారు. డైరెక్టుగా మోడీ కే పరోక్షంగా ఈ హెచ్చరికలు జారీ చేశారు.

అయితే మోడీ మాత్రం చిరాగ్ ను పూర్తిగా పక్కనపెట్టి ఆయన బాబాయికి ఏకంగా కేంద్ర కేబినెట్ హోదాతో మంత్రి పదవి కల్పించాడు. నిజానికి చిరాగ్ కే కేంద్రమంత్రి పదవి ఇచ్చి పశుపతి వర్గాన్ని పక్కనపెడుతారని అంతా అనుకున్నారు. ఎందుకంటే గత బీహార్ ఎన్నికల్లో బీజేపీపై పోటీ పెట్టకుండా జేడీయూపై పెట్టి మోడీ తనకు రాముడి వంటి వాడని.. తాను హనుమంతుడిని అని చిరాగ్ ప్రకటించడం సంచలనమైంది.

అయితే మోడీని ఎంత కీర్తించినా కానీ చిరాగ్ పాశ్వాన్ మొరను మాత్రం ఆ దేవుడు ఆలకించలేదు. చిరాగ్ కు కనీసం సహాయ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఆయన ప్రత్యర్థి పశుపతికి మోడీ అందలం ఎక్కించాడు.

ఈ క్రమంలోనే చిరాగ్ వరుస ట్వీట్లు పెట్టి నిరసన తెలిపాడు. ఈ అంశంపై కోర్టుకు ఎక్కుతున్నట్టు ప్రకటించారు. పార్టీలో తిరుగుబాటు ఎంపీలపై కోర్టుకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించాడు.మోడీని నమ్ముకున్న పాపానికి ఇప్పుడు చిరాగ్ మునిగిపోయాడు.ప్రత్యర్థికే అందలం ఎక్కించి మోడీ ఈ కుర్ర ఎంపీకి గట్టి షాక్ యే ఇచ్చాడు. నిండా మునిగి ఇప్పుడు చిరాగ్ లబోదిబోమంటున్నాడట..