Begin typing your search above and press return to search.

అన్నేళ్లు పవర్ లో ఉన్నా కాంగ్రెస్ చేయలేనిది మోడీ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   16 Aug 2021 3:44 AM GMT
అన్నేళ్లు పవర్ లో ఉన్నా కాంగ్రెస్ చేయలేనిది మోడీ చేస్తున్నారు
X
అవును.. గతానికి భిన్నంగా ప్రధాని నరేంద్ర మోడీ మీద విపరీతమైన విమర్శలతో పాటు.. ఆయన్ను అదే పనిగా తప్పు పట్టటం ఈ మధ్యన ఎక్కువైంది. ప్రతి ఒక్కరికి నిత్యం పెట్రోల్.. డీజిల్ ధరలు కళ్ల ముందు కనిపిస్తూ ఉండటం.. కడుపు రగిలిపోవటంతో మోడీ సర్కారు చేసే పనుల్ని పట్టించుకోవటం మానేయటం ఈ మధ్యన ఎక్కువైంది. కష్టంలో ఉన్న వాడికి.. వారి కష్టం మాత్రమే కనిపిస్తుందే తప్పించి.. ఇంకెవరి గోలను పట్టించుకునే పరిస్థితుల్లో ఉండరు. ఇప్పుడు దేశ ప్రజల పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంది.

లీటరు పెట్రోల్ ను వంద రూపాయిల్ని దాటేయించటమే కాదు.. ఈ పెంపును ఎక్కడ వరకు తీసుకెళతారో అర్థం కాని పరిస్థితి. తెల్లారింది మొదలు నిద్ర పోయేవరకు ప్రతి ఒక్కడి జేబుల మీద నేరుగా వేస్తున్న భారం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ విషయాన్ని మోడీ సర్కారు సీరియస్ గా తీసుకోకుంటే.. జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మోడీ సర్కారు చేస్తున్న డెవలప్ మెంట్ యాక్టివిటీలు పెద్దగా ఫోకస్ కావటం లేదు.

పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట మీద నుంచి ప్రసంగించిన ప్రధాని మోడీ.. త్వరలో 75 సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లను పట్టాల మీదకు ఎక్కిస్తామని పేర్కొన్నారు. ఈ వార్త జాతి జనులను ఆనందాన్ని కలిగించేదిగా మారింది. మోడీ సర్కారు పవర్లోకి వచ్చిన తర్వాత రైల్వేల రూపురేఖలు మారతాయని.. కాంగ్రెస్ సర్కారు చేసిన నిర్లక్ష్యాన్ని జెట్ వేగంతో దూసుకెళ్లేలా చేస్తారన్న అంచనాలు భారీగా వినిపించాయి. అయితే.. అలాంటివేమీ బడ్జెట్ సందర్భంగానూ ప్రస్తావించలేదు. అందరూ ఎంతో ఆశగా ఎదురుచూసే రైల్వేలకు సంబంధించి ఎలాంటి ఆసక్తికర ప్రకటన లేకపోవటం ప్రజలకు కొరతగా మారింది. ఇలాంటి సందర్భంలో.. దేశ వ్యాప్తంగా 75 కొత్త రైళ్లను పట్టాలెక్కిస్తామని ప్రకటించటం ఆనందోత్సాహాల్ని కలిగిస్తోంది.

ఇదంతా ఒకఎత్తు అయితే.. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. రైల్వే శాఖను పునర్ వ్యవస్థీకరణ విషయంలో అంత జోరును ప్రదర్శించలేదనే చెప్పాలి. కాంగ్రెస్ కు చేతకానిది.. మోడీ సర్కారు చేతనైందన్న విషయంలొ ఏం చేశారన్నది చూస్తే.. ఈశాన్య ప్రాంతాల్లో రైళ్ల కనెక్టివిటీని పెంచే ప్రయత్నం చేశారు. గతంలో కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు రైలు సౌకర్యం కల్పించరే కానీ.. మిగిలిన ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ చేపట్టలేదు. ఇప్పుడా లోటును భర్తీ చేస్తున్నారు. అసోం.. త్రిపుర.. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని నగరాలకు కనెక్టివిటీని కల్పించారు.

మణిపూర్.. విజోరం.. త్రిపుర.. అరుణాలచల్ ప్రదేశ్ రాజధాని నగరాల కనెక్టివిటీ పెరుగుతుంటే. మణిపూర్.. మిజోరం.. నాగాలాండ్.. మేఘాలయ రాజధాని నగరాలకు రైల్ కనెక్టివిటి పనులు వేగంగా సాగిపోతున్నాయి. చూస్తుంటే.. అన్ని పనులు పూర్తి చేయనున్నట్లు చెబుతున్నారు. తొలుత అనుకున్న దాని కంటే.. వేగంగా పనులు సాగుతన్నాయని.. 2024 నాటికి పూర్తి అవుతాయని చెబుతున్నారు. దశాబ్దాల తరబడి ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాగా వేసినప్పటికి అక్కడి వారికి ఏం చేయలేదన్న భావన ఎక్కువగా ఉంది. అందుకు భిన్నంగా మోడీ సర్కారు మాత్రం.. తాను చెప్పిన మాటలకు తగ్గట్లే రైల్వే లైన్ ను అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో భారీ కమిట్ మెంట్ తో పని చేస్తోందని మాత్రం చెప్పక తప్పదు.