Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు.. నిండు సభలో పరువు తీసిన మోడీ

By:  Tupaki Desk   |   9 Feb 2023 6:22 PM GMT
ఎన్టీఆర్ కు వెన్నుపోటు.. నిండు సభలో పరువు తీసిన మోడీ
X
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళ మోడీ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. అదానీ అక్రమాలపై ప్రతిపక్షాలు గోల చేస్తుంటే కాంగ్రెస్ కుంభకోణాలపై డైవర్ట్ చేస్తూ మోడీ పవర్ ఫుల్ స్పీచ్ ను నిన్న లోక్ సభలో ఇచ్చారు. నేడు రాజ్యసభలో ఆ పని చేశారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ మోడీ ‘ఎన్టీఆర్ వెన్నుపోటు’ చరిత్రను తవ్వారు.

పార్లమెంట్ లో ఈసారి అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య వాడివేడి చర్చ సాగింది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరి చరిత్రను మరొకరు తవ్వుతున్నారు. గౌతం అదానీ మోసాలపై హిండెన్ బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండగా.. మోడీ మాత్రం కాంగ్రెస్ చేసిన తప్పులను బయటకు తీసే పనిలో పడ్డారు.

రాజ్యసభలో మాట్లాడిన మోడీ నిన్న లోక్ సభ కంటే తీవ్రత పెంచారు. కాంగ్రెస్ పై ఎదురుదాడి చేశారు. హిండెన్ బర్గ్ నివేదికపై దర్తాప్తు కోసం కాంగ్రెస్ పట్టుబట్టగా.. ఆపార్టీ గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపే పనిలో పడ్డారు ప్రధాని. నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రభుత్వాల గురించి ఆయన మాట్లాడారు. తాము బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చామంటున్న కాంగ్రెస్ ఆ పార్టీ చరిత్రలో ఎన్ని ప్రభుత్వాలను కూల్చిందో లెక్కలు వేయాలని మోడీ విమర్శించారు.

తమిళనాడులో ఎంజీ రామచంద్రన్, కరుణానిధి ప్రభుత్వాలను కాంగ్రెస్ నేతలు కూల్చారని.. మహారాష్ట్రలో శరద్ పవార్ ప్రభుత్వాన్ని కూల్చారని ధ్వజమెత్తారు. కేరళలో కమ్యూనిస్టుల సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైతే పండిట్ నెహ్రూ దాన్ని పడగొట్టారని అన్నారు. ఈ క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ పేరును తన ప్రసంగంలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఎన్టీఆర్..చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను గద్దె దించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. నాదెండ్ల భాస్కర్ రావు ఉదంతాన్ని పరోక్షంగా ప్రధాని మోడీ గుర్తు చేశారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను 90 సార్లు కాంగ్రెస్ కూల్చిందని.. ఇందిరాగాంధీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని..ఇన్ని లోపాలున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ తమను విమర్శించడం సరికాదని మోడీ హితవు పలికారు.