Begin typing your search above and press return to search.

ఫ్రెండ్లీగా ఉంటే ఇలానా?కడిగేసిన గులాబీ నేత

By:  Tupaki Desk   |   7 Feb 2017 5:07 AM GMT
ఫ్రెండ్లీగా ఉంటే ఇలానా?కడిగేసిన గులాబీ నేత
X
ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రధాని మోడీని కలిసి.. తమ మద్దతును ప్రకటించాలని భావించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊహించని రీతిలో షాక్ తగలటం తెలిసిందే. అఖిలపక్ష నేతల్ని ఢిల్లీకి తీసుకెళ్లి.. ఎస్సీ వర్గీకరణపై తమ అభిప్రాయాన్ని ప్రధాని ఎదుట చెప్పించాలన్న కేసీఆర్ ప్రయత్నం సాధ్యం కాకపోవటం తెలిసిందే. ప్రధాని దగ్గర ఫిక్స్ అయిన అపాయింట్ మెంట్.. అనూహ్యంగా క్యాన్సిల్ కావటంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా టీఆర్ ఎస్ నేతలంతా షాక్ కుగురైన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీఎం కేసీఆర్ ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. అందుకు భిన్నంగా.. టీఆర్ ఎస్ లోక్ సభాపక్షనేత ఏపీ జితేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ కావటమే కాదు.. ప్రధాని అపాయింట్ మెంట్ క్యాన్సిల్ కావటానికి కారణం ఏమిటో వెల్లడించారు. అదే సమయంలో ఎన్డీయే ప్రభుత్వానికి తాము సాయం చేస్తున్నా.. తమకు మాత్రం అండగా నిలవటం లేదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. లోక్ సభ సాక్షిగా.. తమ ముఖ్యమంత్రికి ప్రధాని అపాయింట్ మెంట్ ఇచ్చి మరీ క్యాన్సిల్ చేయటంపై ఫైర్ కావటమే కాదు.. సాయంగా ఉంటున్న వారిని ఇలా చేస్తారా? అంటూ కొత్త పాయింట్ ను తెరపైకి తీసుకొచ్చారు.

ప్రధాని అపాయింట్ మెంట్ క్యాన్సిల్ కావటం వెనుక తెలంగాణ బీజేపీ నేతలు ఉన్నారని.. ఆ విషయం మీడియాలో వచ్చిన వార్తల్ని చూస్తేనే అర్థంఅవుతుందని జితేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానపైం జరిగిన చర్చలో పాల్గొన్న జితేందర్ రెడ్డి.. తమది కొత్త రాష్ట్రమని.. కేంద్రం నుంచి పూర్తి మద్దతు కావాలని మొదట్నించి అడుగుతున్నామని.. కేంద్రానికి సాయం అవసరమైనప్పుడు సాయపడుతున్నామని.. తమ ముఖ్యమంత్రి ఆ దిశగా తమకు సూచనలు చేసినట్లుగా వెల్లడించారు.

దురదృష్టకరమైన విషయంఏమిటంటే.. ఏపీ విభజన చట్టంలో ఉన్న హామీల్ని కేంద్రంఅమలు చేయలేదన్నారు. చాలా బాధతో తామీ మాటలు చెబుతున్నట్లుగా చెప్పిన జితేందర్రెడ్డి.. ఎస్సీ వర్గీకరణ కోసం తమ రాష్ట్రంలోఉన్న డిమాండ్ ను ప్రధాని దృష్టికి తెచ్చేందుకు అఖిలపక్షంతో వచ్చి కలవాలని తమ ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ అడిగారని.. కానీ.. ఇచ్చిన అపాయింట్ మెంట్ ను వెనక్కి తీసుకున్నారన్నారు.

తెలంగాణ బీజేపీ ప్రధానికి చెప్పి.. తమకిచ్చిన అపాయింట్ మెంట్ ను రద్దు చేయించారన్నారు. అనేక అంశాల్లో కేంద్రానికి తాము మద్దతుగా నిలిచినా.. విపక్షాలు విమర్శించినా తాము మద్దతు ఇచ్చినట్లు చెప్పిన ఆయన.. రిపబ్లిక్ డే సందర్భంగా తమ శకటానికి అనుమతి ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నోట్ల రద్దుపై విపక్షాలు విమర్శించినా.. మేం మాత్రం మీకుమద్దతుగా నిలిచాం’’ అని వ్యాఖ్యానించారు.

ప్రధాని అపాయింట్ మెంట్ రద్దుపై ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి దత్తాత్రేయ స్పందించారు. జితేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని.. అపాయింట్ మెంట్ ను వ్యతిరేకించలేదని.. వాయిదా పడి ఉండొచ్చని.. రద్దుకాలేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. తెలంగాణకు కేంద్రం మద్దతుగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. దీనిపై రియాక్ట్ అయిన జితేందర్ రెడ్డి బీజేపీ నేతలు పత్రికల్లో చెప్పిన మాటలే తాను చెప్పినట్లుగా వ్యాఖ్యానించారు. మొత్తానికి తమ అధినేతకు అపాయింట్ మెంట్ ఇచ్చి.. క్యాన్సిల్ చేసిన ఉదంతంపై ఎంపీ జితేందర్ ఎంత హడావుడి చేయాలో అంత హడావుడి చేశారని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/