Begin typing your search above and press return to search.

రాత్రి 10 గంటలకు మోడీ నుంచి ఫోనొస్తే..?

By:  Tupaki Desk   |   30 Aug 2016 4:45 AM GMT
రాత్రి 10 గంటలకు మోడీ నుంచి ఫోనొస్తే..?
X
ఆయన త్రిపుర రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారి... నెల రోజుల కిందట ఒక రోజు రాత్రి 10 గంటలకు ఆయన ఫోన్ మోగింది..

ఐఏఎస్ అధికారి ఫోన్ మోగడంలో వింతేముంది అనుకుంటున్నారా...? వింత లేదు కానీ, విశేషం ఉంది.

ఆయనకు ఫోన్ చేసింది ఎవరో కాదు - దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. అవును, మోడీ ఆయనకు స్వయంగా ఫోన్ చేసి అభివృద్ధి పనుల గురించి దిశానిర్దేశం చేశారు. తెల్లారి లేచి ఆయన ఆఫీసుకు వెళ్లేసరికి నిధులు అందాయి... వెంటవెంటనే పనులు మొదలయ్యాయి... భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు బాగయ్యాయి. వినడానికి సినిమాటిక్ గా ఉన్న ఈ కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా స్ప్రెడ్ అవుతోంది. పాలనలో గత ప్రధానులకు భిన్నంగా తానే సాగుతున్న ప్రధాని మోడీ ప్రచారంలోనూ గత ప్రధానులకంటే ఎంతో భిన్నమైనవారు. అందుకే సోషల్ మీడియాలో వస్తున్నంది నిజమని నమ్ముతున్నవారు ఎంతమంది ఉన్నారో అది ఉత్తుత్తి ప్రచారమని అనుకుంటున్నవారూ అంతేస్థాయిలో ఉన్నారు. అయితే.... మొట్టమొదటగా దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇంటర్నెట్ లో పెట్టిన పుష్పక్ చక్రవర్తి మాత్రం ఇదంతా నిజమని.. కట్టుకథ కాదని చెబుతున్నారు.

అసలేం జరిగింది..

గత నెలలో ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తి రోడ్లు దెబ్బతిన్నాయి - జనజీవనం అతలాకుతలమైంది. ఆ సందర్భంలో త్రిపురను మిగతా దేశంతో కలిపే నేషనల్ హైవే 208 తీవ్రంగా దెబ్బతింది. దీంతో త్రిపుర రాష్రంలోకి రవాణా సదుపాయం లేకుండా పోయింది. నిత్యావసరాలు కానీ, పెట్రోలు - డీజిలు కానీ ఆ రాష్ర్టానికి రావడం గగనమైంది. అసలే వరదలు... వర్షాలు.. ఆపై సరకులు అందుబాటులో లేకపోవడంతో త్రిపుర ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ధరలు ఆకాశానికంటాయి. ఆ సమయంలో జులై 21న రాత్రి 10 గంటలకు ఉత్తర త్రిపురలోని ఒక జిల్లా కలెక్టరుకు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. మీతో ప్రధాని మోడీ మాట్లాడతారంటూ ఓ అధికారి ఆ కలెక్టరుకు చెప్పారు. దాంతో ఆయన వెంటనే అలర్టయిపోయారు. మోడీ మాట్లాడుతూ... మొదట ఆ సమయంలో ఫోన్ చేసినందుకు క్షమించాలని కోరుతూనే ‘‘ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు... ఇప్పుడే నేను రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యాను.. 208 నంబరు నేషనల్ హైవేను మరమ్మతు చేస్తే పరిస్థితులు చక్కబడతాయని తెలిసింది.. అందుకు నిధులిచ్చి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఆ పనులు పర్యవేక్షించండి’’ అని సూచించారు.

మరుసటి రోజు ఆయన తన కార్యాలయానికి వెళ్లేటప్పటికి నిధులు మంజూరైనట్లు సమాచారం అందింది. వెంటనే ఆయన దెబ్బతిన్న రోడ్డును పునరుద్ధిరంచడానికి రంగంలోకి దిగారు. అక్కడికి వెళ్లేసరికి అస్సాం ప్రభుత్వం పంపించిన రోడ్డు నిర్మాణ మెటీరియల్ అక్కడ ఉంది. యంత్రాలున్నాయి. ఇంకేమీ ఆలస్యం చేయకుండా ఆ అధికారి దగ్గరుండి పనులన్నీ చూసుకుంటూ 15 కి.మీ. రోడ్డును నాలుగు రోజుల్లో రాజమార్గంలో మార్చేశారు. దాంతో ఆగస్టు 26న ఆయనకు కేంద్ర ప్రభుత్వ అధికారుల నుంచి మరోసారి ఫోన్ వచ్చింది. ప్రశంసలు దక్కాయి.

మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధి, మోడీ చొరవ వంటివాటికి ఇది తార్కాణమంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే, విమర్శకులు మాత్రం ఇదంతా మోడీ భజనపరులు అల్లిన కట్టుకథలని అంటున్నారు. కానీ... ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ముందే త్రిపురలోని కొన్ని స్థానిక పత్రికల్లో వచ్చినట్లు చెబుతున్నారు. అధికార రహస్యాలు కాపాడాలి కాబట్టి ప్రభుత్వాధికారుల వైపు నుంచి దీనికి సంబంధించి అధికారికంగా సమాచారం బయటకు రాలేదని తెలుస్తోంది.