Begin typing your search above and press return to search.

కొరుకుడుపడని కేసీఆర్ కు.. కొత్త తరహాలో మోడీ గ్రీటింగ్స్

By:  Tupaki Desk   |   18 Feb 2022 3:31 AM GMT
కొరుకుడుపడని కేసీఆర్ కు.. కొత్త తరహాలో మోడీ గ్రీటింగ్స్
X
తిడితే కోపం వస్తుంది. కానీ.. ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రం ప్రేమ పొంగుకు వస్తుంది. ఆయనలోని పెద్ద మనిషి ఇట్టే నిద్ర లేస్తారు. చవట.. దద్దమ్మ లాంటి మాటలు అన్న కేసీఆర్ కు పుట్టిన రోజున తనదైన తోఫా ఇచ్చారు నరేంద్ర మోడీ. తనను నిందిస్తున్న కేసీఆర్ ను ఆయన పుట్టినరోజున మాత్రం.. అందరికీ సోషల్ మీడియాలో విషెస్ పోస్టు పెట్టి.. ముగించకుండా స్వయంగా ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు చెప్పడం మోడీకే చెల్లుతుంది. సాధారణంగా మాటలతో కత్తులు దూస్తున్న రాజకీయ అధినేత విషయంలో కోపంగా రియాక్టు కావటం అందరూ చేసేదే. కానీ.. ప్రధాని మోడీ స్టైల్ మాత్రం కాస్త భిన్నంగా ఉంటుందన్న విషయం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మరోసారి రుజువైంది.

ఎందుకిలా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. కేసీఆర్ లోని కొరుకుడుపడని తీరుగా చెప్పక తప్పదు. చాలామందికి తెలీదు కానీ.. ఎవరినైనా లైట్ తీసుకునే నరేంద్ర మోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో మాత్రం కాస్తంత అలెర్ట్ గా ఉంటారని చెబుతారు. మిగిలిన వారిపై వెనుకా ముందు చూసుకోకుండా విరుచుకుపడేందుకు ఉత్సాహం చూపించే ఆయన.. గులాబీ బాస్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. మిగిలిన రాజకీయ అధినేతలకు లేని ముందుచూపు.. విషయాల్ని ఎప్పుడు.. ఎలా డీల్ చేయాలో తెలీటంతో పాటు.. ఆయన మేధస్సుపై మోడీ కి ఒక అభిప్రాయం ఉందని చెబుతారు.

అందుకే.. కేసీఆర్ విషయంలో తొందరపాటుకు కాకుండా.. ఆచితూచి స్పందించేలా వ్యవహరించాలన్నట్లుగా ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానంటూ స్పష్టమైన సంకేతాలు ఇవ్వటమే కాదు.. అందుకు తగ్గట్లు ఇప్పటికే ప్రకటనలు చేసిన కేసీఆర్ కు పుట్టిన రోజు గ్రీటింగ్స్ ఆయన ఏ మాత్రం ఊహించని రీతిలో రియాక్ట్ కావడం ద్వారా.. గులాబీ బాస్ ఆలోచనలో పడేలా మోడీ వ్యవహరించారన్న మాట వినిపిస్తోంది. దీనికి బదులుగా కేసీఆర్ వర్గీయుల వాదన మరోలా ఉంది. కేసీఆర్ కు ప్రధాని మోడీ ఫోన్ చేయటమంటే తమ అధినేత స్థాయి ఎంతలా పెరిగిందన్న విషయం అర్థం చేసుకోవచ్చన్న మాటను చెబుతున్నారు.

మిగిలిన ముఖ్యమంత్రులు..తన రాజకీయ ప్రత్యర్థుల పుట్టినరోజు సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకునే ప్రధాని.. తన అలవాటుకు భిన్నంగా కేసీఆర్ కు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి.. శుభాకాంక్షలు తెలపడం ద్వారా.. తన లోని పెద్ద మనిషిని మోడీ నిద్ర లేపారని చెప్పాలి.

రాజకీయ ప్రత్యర్థుల విషయంలో కఠినంగా ఉండే మోడీ.. పుట్టినరోజు సందర్భంగా మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుంటారు. కేసీఆర్ పుట్టిన రోజు విషయంలో ఒక అడుగు ముందుకేసి మరీ.. తనలోని పెద్ద మనిషి తత్త్వాన్ని ప్రపంచానికి చాటారని చెప్పాలి. ఈ ఉదంతాన్ని చూస్తే.. కొరుకుడుపడని కేసీఆర్ కు తన మనసులోని భావన అర్థం కాని రీతిలో ప్రధాని మోడీ రియాక్టు అవుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.