Begin typing your search above and press return to search.

వెంకయ్య సీక్రెట్ విందుకు ప్రధాని మోడీ

By:  Tupaki Desk   |   12 Aug 2016 5:20 AM GMT
వెంకయ్య సీక్రెట్ విందుకు ప్రధాని మోడీ
X
ఒకసారి చేతికి చిక్కిన అధికారాన్నివీలైనంత కాలం తమతోనే ఉంచుకోవాలని అందరూ తపిస్తుంటారు. ఇలాంటి విషయాల్లో ప్రధాని మోడీ తీరు కాస్త భిన్నంగానే ఉంటుంది. దూరదృష్టితో వీలైనన్ని ఎక్కువ రోజులు తమ చేతుల్లోనే పవర్ ఉండాలని భావించే ఆయన..గడిచిన కొద్దిరోజులుగా కొన్ని రహస్య విందుల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విందును ప్రధాని స్వయంగా నిర్వహించకుండా.. పలువురు కేంద్ర మంత్రులు నిర్వహించటం.. వాటికి ప్రధాని హాజరు కావటం.. ఈ సందర్భంగా భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఎలా ఉండాలి? ఏం చేయాలన్న అంశాలతో పాటు.. రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాల్ని సిద్ధం చేయాలన్న అంశాలపై కూడా ఈ సీక్రెట్ విందులోనే చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

మొత్తం 330 మంది ఎంపీల్నిఐదు జట్లుగా చేసి.. ఒక్కో జట్టులో 60 మందికి తక్కువగా కాకుండా చూసుకుంటూ వేర్వేరుగా విందులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ నాలుగు విందులు నిర్వహించిన కేంద్రమంత్రులు.. తాజాగా ఐదో విందును వెంకయ్యనాయుడు నిర్వహించారు. ఇంతకు ముందు ఇచ్చిన నాలుగు విందుల్ని కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్.. నితిన్ గడ్కరీ.. రాజ్ నాథ్ సింగ్.. అరుణ్ జైట్లీలు నిర్వహించారు. తాజాగా ఈ సీక్రెట్ డిన్నర్ ను నిర్వహించే బాధ్యత వెంకయ్యనాయుడు మీద పడింది.

మీడియా హడావుడికి దూరంగా.. భారీ ఏర్పాట్లు చేయకుండా నిరాడంబరంగా వెంకయ్య విందు రహస్యంగా జరిగింది. ఈ విందులో భాగంగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాల గురించి చర్చ జరిగిందని చెబుతున్నారు. ఎండీఎంసీ హౌస్ లో జరిగిన ఈ కార్యక్రమం నాలుగు గంటల పాటు సాగినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన అంశాలతో పాటు.. ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వెంకయ్య ఇచ్చిన విందు బాగుందన్న మాట వినిపిస్తోంది. కాకుంటే.. ఆయన ఇచ్చే విందులు హడావుడిగా ఉంటే.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా సింఫుల్ గా జరిగినట్లు తెలుస్తోంది. ఎంతైనా సీక్రెట్ డిన్నర్లకు మరీ హడావుడి చేయలేరు కదా..?