Begin typing your search above and press return to search.

ఏడాదిలో మోడీ పెరిగిన ఆస్తి ఎంతంటే..

By:  Tupaki Desk   |   25 Aug 2016 4:37 AM GMT
ఏడాదిలో మోడీ పెరిగిన ఆస్తి ఎంతంటే..
X
ప్రముఖులు తమ ఆస్తుల్ని ప్రకటించటం తెలిసిందే. అయితే.. ఈ ప్రకటన అంతా ప్రచారానికి మాత్రమే పనికొచ్చేదిగా ఉంటుందన్న విమర్శ ఉంది. దీనికి భిన్నంగా తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల ప్రకటన ఉందన్న మాట వ్యక్తమవుతోంది. ఏడాది వ్యవధిలో తన ఆస్తుల్ని పెంచుతూ మోడీ తాజాగా ఆ వివరాల్ని వెల్లడించారు. గడిచిన ఏడాదిలో ఆయన ఆస్తి విలువ పెరగటమే కాదు.. చేతిలో ఉండే నగదు కూడా పెరగటం గమనార్హం.

ఆదాయ మార్గాల్లో ఈసారి పుస్తకాల రాయల్టీ కూడా వచ్చి చేరటం గమనార్హం. ఇటీవల ప్రభుత్వానికి తన ఆస్తుల వివరాల్నివెల్లడించిన ఆయన.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆయన ఆస్తుల విలువ 22.6 శాతం మేర పెరగటం గమనార్హం. గత ఏడాది ఆయన ఆస్తుల విలువ రూ.1.41 కోట్లు కాగా.. ఈ ఏడాది ఆయన ఆస్తుల విలువ రూ.1.73 కోట్లుగా పేర్కొన్నారు. ఆస్తులకు తగ్గట్లే ఆయన చేతిలో ఉన్న క్యాష్ కూడా పెరిగింది. ఇది 19రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

గత ఏడాది తన దగ్గర రూ.4700 ఉన్నట్లు చూపించిన మోడీ.. ఈసారి మాత్రం తన దగ్గర రూ.89,700 ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే తన ఆస్తుల విలువ పెరగటానికి పుస్తకాల రాయల్టీ మీద వచ్చే ఆదాయమంటూ తొలిసారి ఆ మొత్తాన్ని చూపించారు. ఏడాది వ్యవధిలో పుస్తకాల రాయల్టీ మీద వచ్చిన ఆదాయం రూ.12.35 లక్షలు కావటం గమనార్హం. ఇక తన దగ్గరున్న ఉంగరాల విలువను సైతం గతంతో పోలిస్తే ఎక్కువగా చూపించారు. గతంలో ఈ ఉంగరాల విలువ రూ.1.18 లక్షలు కాగా.. ఈసారి వాటి విలువ రూ.1.27 లక్షలుగా చూపించారు. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే మోడీ తన ఆస్తుల వివరాల్ని మాత్రమే వెల్లడించారు. తన భార్య ఆస్తుల లెక్క చెప్పలేదు. భార్య ఆస్తులు అన్న స్థానంలో తెలీదన్న మాటను పేర్కొన్నారు. దేశ ఆర్థిక వృద్ధి రేటుతో పోలిస్తే.. ఏడాది వ్యవధిలో మోడీ ఆస్తుల వృద్ధి రేటు మాంచి జోరు మీదున్నట్లు కనిపిస్తుంది. వ్యక్తిగతంగా భారీగా ఆర్థిక వృద్ధి రేటును ప్రదర్శించిన మోడీ.. దేశ ఆర్థిక పరిస్థితిని అలానే మెరుగుపరిస్తే ఎంత బాగుండేదో..?