Begin typing your search above and press return to search.

మోడీ హ‌త్య కుట్ర‌లో తెలుగుర‌చ‌యిత‌..?

By:  Tupaki Desk   |   9 Jun 2018 4:19 AM GMT
మోడీ హ‌త్య కుట్ర‌లో తెలుగుర‌చ‌యిత‌..?
X
వ‌ర‌వ‌ర‌రావు..విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం నాయ‌కుడు. తెలుగు రాష్ర్టాల్లో ఆయ‌న పేరు సుప‌రిచితం. వామ‌ప‌క్ష భావ‌జాలంతో సాగే ఏ కార్య‌క్ర‌మాల్లో అయినా...ఆయ‌న పాల్గొంటారు. అయితే, అలాంటి వ్య‌క్తి తాజాగా తీవ్ర వివాదాస్ప‌ద‌మైన అంశంలో మ‌రోమారు వార్త‌ల్లోకి ఎక్కారు. అదే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ హ‌త్య కుట్ర‌లో ఆయ‌న పేరు కూడా వెలుగులోకి రావ‌డం వ‌ల్ల‌! ప్రధాని నరేంద్ర మోడీని చంపడానికి మావోయిస్టులు కుట్ర పన్నినట్టు పుణె పోలీసులు తెలిపిన విష‌యం సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. మావోయిస్టు పార్టీతో లింక్‌లు ఉన్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినప్పుడు... వారి దగ్గర దొరికిన ఓ లేఖ కలకలం రేపుతోంది. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ తరహాలో మోడీని కూడా చంపడానికి మావోయిస్టులు కుట్రపన్నినట్టు లేఖలో ఉందని తెలిపారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని కూడా మాజీ ప్ర‌ధాని రాజీవ్ హత్య తరహా ప్రణాళిక రూపొందించాలని - ఇందుకు నాలుగు లక్షల రౌండ్ల బుల్లెట్లు - ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం పడతాయని లేఖలో పేర్కొంటూ - ఈ కుట్రలో వరవరరావు సహకారంతో డబ్బు సర్దుబాటు చేయాలని ప్రస్తావించారు. దీంతో అంద‌రి చూపు వర‌వ‌ర‌రావుపై ప‌డింది. ఈ నేప‌థ్యంలో వ‌ర‌వ‌ర‌రావు మీడియాతో మాట్లాడ‌టంతో పాటుగా....విప్లవ రచయితల సంఘం ఓ పత్రికా ప్రకటన విడుద‌ల చేసింది. వ‌ర‌వ‌ర‌రావు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారని తాను అనుకోవడం లేదని అన్నారు. ప్రధానిని హత్యచేసే శక్తి మావోయిస్టులకు ఉందా? అనేది కూడా అనుమానమేనని అన్నారు. అస‌లు ఇదంతా ఉద్దేశ‌పూర్వ‌క‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. ఆదివాసీల కోసం పోరాటం చేస్తున్న వారిని టార్గెట్‌ చేయడానికేనని వరవరరావు వ్యాఖ్యానించారు. ఇదంతా తనను టార్గెట్‌ చేయడమే అనిపిస్తుందన్నారు. ఇటీవల మోడీ గ్రాఫ్ తగ్గుతుందని, ఆయన ఇమేజ్‌ పెంచే చర్యగా తాను ఈ కుట్రను భావిస్తున్నానని ఆయన అన్నారు.

కాగా, కామ్రేడ్ వరవరరావుపై కుట్ర ఆరోపణలను ఖండిస్తున్నామ‌ని విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం ప‌త్రికా ప్ర‌క‌ట‌న పేర్కొంది. ఇది ప్రజాసంఘాలను - ప్రశ్నించే హక్కును అణచేందుకు పన్నిన భారీ కుట్ర అని తెలిపింది. భీమా-కోరేగావ్ హింసకు కారకులని ఆరోపిస్తూ దళిత - ఆదివాసీ హక్కుల - ప్రజాసంఘాల బాధ్యుల అరెస్టును నిరసిస్తున్న సమయంలోనే అంతకన్నా కుట్రపూరిత చర్యలకు పోలీసులు తెరతీశారని దుయ్య‌బ‌ట్టింది. విర‌సంకు చెందిన కార్యదర్శి పాణి - సీనియర్ సభ్యులు కళ్యాణరావు - కార్యవర్గ సభ్యులు వరలక్ష్మి - కాశిం - రాంకీ పేరుతో ప్ర‌క‌ట‌న విడుద‌ల అయింది.

``ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని ఒక లేఖను సృష్టించి అందులో విరసం వ్యవస్థాపక సభ్యులు కామ్రేడ్ వరవరరావు పేరును ఇరికించారు. కోరేగావ్ లో అసలు నిందితులైన సంఘపరివార్ నాయకులను వదిలేసి దళిత సంఘాలు, హక్కుల సంఘాల నాయకుల్ని అరెస్టు చెసి అంతటితో ఆగకుండా దాని కొనసాగింపుగా ఒక కుట్ర కేసును రచించడం ద్వారా ప్రజాసంఘాలను, దళిత ఉద్యమాలను విప్లవ ప్రజాస్వామిక భావాల వ్యక్తీకరణను అణచివేయాలని చూస్తున్నారు. ఇది నాగపూర్ కేంద్రంగా ఆరెస్సెస్, బిజెపి శక్తులు రచించిన కుట్ర. ఇలాంటి కుట్ర రచనలు వారికి కొత్త కాదు`` అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు కూడా ఇలాంటిదొకటి జరిగిందని విర‌సం ప్ర‌క‌ట‌న పేర్కొంది. `తమ పట్ల విశాల ప్రజారాశుల్లో వ్యతిరేకత ప్రబలుతున్నపుడు ప్రజల సానుభూతిని పొందేందుకు, ప్రధాన సమస్యలపై దృష్టి మళ్లించేందుకు, పనిలో పనిగా ఉద్యమించే శక్తులను, ప్రశ్నించే గొంతుల్ని అణిచేందుకు పాలకులు తమ చేతుల్లో ఉండే నిఘా విభాగాన్ని, పోలీసు శాఖను ఉపయోగించుకొని ఇలాంటి పనులు చేస్తారు. మోదీపై కుట్ర పెద్ద అబద్ధం. అసలు కుట్ర మోడీ రాజ్యం చేస్తున్నది. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్న ప్రయోజనాల్లో ఒక్కటి కూడా నెరవేరక పోగా మరింతగా అది అప్రదిష్ట మూటగట్టుకుంటుంది. ప్రభుత్వం ప్రజలకు బాధ్యతపడటం పోయి కార్పొరేట్లకు నిబద్ధులై అమలు చేస్తున్న విధానాల అసలు రూపు దాచేస్తే దాగదు. మతం పేరుతో, సంస్కృతి పేరుతో ప్రభుత్వం చేస్తున్న విన్యాసాలను, వికృత పోకడలను భీమా కోరేగావ్ మరో మారు అణగారిన ప్రజల ముందు పెట్టింది. అది సహించలేకే మోదీ ప్రభుత్వం ఫాసిజాన్ని అమలు చేస్తున్నది. నాగపూర్ నుండి భీమా కోరేగావ్ మీదుగా హైదరాబాద్ దాకా ప్రభుత్వం పన్నిన కుట్రను తిప్పికొట్టవలసిందిగా పజలకు, ప్రజాసంఘాలకు, ప్రజాస్వామిక వాదులకు విరసం విజ్ఞప్తి చేస్తోంది`` అని తెలిపింది.