Begin typing your search above and press return to search.

మోదీ ఏపీ పర్యటన: వస్తే ఏమిస్తారు.. ఏం ప్రకటిస్తారు

By:  Tupaki Desk   |   13 Feb 2020 2:30 PM GMT
మోదీ ఏపీ పర్యటన: వస్తే ఏమిస్తారు.. ఏం ప్రకటిస్తారు
X
ఆంధ్రప్రదేశ్‌ కు విడదీయరాని సంబంధం ఉంది. ఎందుకంటే విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని లేదు. చంద్రబాబు హయాం లో ప్రకటించిన రాజధాని అమరావతికి ప్రధానమంత్రి గా నరేంద్ర మోదీ హంగు ఆర్భాటాల మధ్య శంకుస్థాపన చేశారు. అతిరథ మహురథులంతా హాజరై అమరావతికి అంకురార్పణ చేశారు. అయితే ఆ సభలో ప్రధానమంత్రి ఆర్థికంగా నష్ట పోయిన ఏపీకి ఏమైనా ప్రకటిస్తారా అని అందరూ ఎదురుచూడగా మట్టి, నీళ్లు ఇచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రధానమంత్రి పలుమార్లు ఏపీకి వచ్చినా అంతగా ప్రభావం లేదు. ఎన్నికల సమయంలో వచ్చిన మోదీ పర్యటన పై అంతగా ఆసక్తి లేదు.

కానీ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిశారు. మార్చి 25వ తేదీ ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నాం.. ఆ కార్యక్రమానికి తమరు హాజరు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జగన్‌ ఆహ్వానించారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. మీరు తప్పకుండా రావాలి అని మరీ మరీ విజ్ఞప్తి చేసి జ్ఞాపిక, శాలువా కప్పి వచ్చారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన జగన్‌, మోదీ భేటీ ఆంధ్రప్రదేశ్‌లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అయితే నరేంద్రమోదీ జగన్‌ ఆహ్వానాన్ని మన్నించి వస్తారా.. లేదా.. అని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటించ లేదు. చంద్రబాబు ఉన్న సమయం లో ఉన్నట్టు రాజకీయ పరిస్థితులు లేవు. రాష్ట్రంలో పరిణామాలు మారాయి. ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి ఆయన వచ్చే వరకు ఉండక పోవచ్చు. మిత్రుడిగా ఉన్న చంద్రబాబు శత్రువయ్యారు. రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో ఉంది. లోటు బడ్జెట్‌ తో సతమతమవుతోంది. మరీ ఈ పరిస్థితి లో ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటిస్తారా లేదో వేచి చూడాలి.

ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌లో మారిన పరిస్థితులపై ఎలా స్పందిస్తారో. ఆయన శంకుస్థాపన చేసిన అమరావతి లేదు.. ఆరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఆశించిన స్థాయిలో ఎలాంటి నిధులు, బహుమతులు రాలేదు. ఇక జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధానంగా లేవనెత్తిన అంశం ప్రత్యేక హోదా. ఏపీలో పర్యటిస్తే నరేంద్రమోదీ వీటిపై స్పందించాల్సిందే. ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రానికి కొంత రాయితీలు, నిధులు ‍ప్రకటించాల్సిందే. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి, బీజేపీకి మధ్య విమర్శలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి పర్యటన ఉత్కంఠగా మారింది. ప్రధాని పర్యటన విషయమై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.