Begin typing your search above and press return to search.

మోడీ ప్రకటన వెనుక సుప్రీంకోర్టు చీవాట్లేనా?

By:  Tupaki Desk   |   8 Jun 2021 5:30 AM GMT
మోడీ ప్రకటన వెనుక సుప్రీంకోర్టు చీవాట్లేనా?
X
దేశ ప్రజలకు ఉచితంగా టీకా వేస్తానన్న ప్రధాని మోడీ ప్రకటనపై ఇప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కట్టడికి ఇప్పుడు వ్యాక్సిన్ తప్ప మరో మార్గం లేదు. దీనికోసం ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్ మాత్రమే.. ఇప్పటిదాకా కేంద్రం అవలంభించిన విధానాలపై ఎన్నో విమర్శలు.. ఆరోపణలు వచ్చాయి.

మరోవైపు రాష్ట్రాల నుంచి టీకాల కోసం విజ్ఞప్తులు, ప్రతిపక్షాల డిమాండ్లు మరో వైపు.. సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం దీంతో కేంద్ర దిగిరాక తప్పలేదు. అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ అంటూ ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించడం సంచలనమైంది. రాష్ట్రాలు ఒక్క రూపాయి కూడా వ్యాక్సిన్లపై ఖర్చు చేయాల్సిన అవసరం లేదని.. కేంద్రమే రాష్ట్రాలకు సరఫరా చేస్తుందని.. 75శాతం రాష్ట్రాలకు సరఫరా చేస్తే.. 25శాతం ప్రైవేటు ఆస్పత్రులకు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

ఇక ప్రధాని మోడీ ప్రకటనను బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు.. ఆ పార్టీ నేతలు స్వాగతిస్తుంటే సుప్రీంకోర్టు మందలించడంతోనే ఆలస్యంగా ఈ ప్రకటన చేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఇక ప్రధాని నరేంద్రమోడీ ప్రకటనతో సుప్రీంకోర్టుపై.. జస్టిస్ చంద్రచూడ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. కేంద్రం వ్యాక్సినేషన్ లోని లోపాలను జస్టిస్ చంద్రచూడ్ ఎండగట్టడంతో ఇది సాధ్యమైందని నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ చంద్రచూడ్ కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. దీంతో ఓ దశలో ట్రెండింగ్ లోకి వచ్చారు చంద్రచూడ్.

సుప్రీంకోర్టు విచారణ సమయంలో ఆయనచేసిన వ్యాఖ్యలు, ఆదేశాలను మీడియా హైలెట్ చేయడంతో కేంద్రం పునరాలోచించి ఇప్పుడు ఉచిత వ్యాక్సినేషన్ చేయించిందని.. వ్యాక్సినేషన్ పై మొత్తం నోటింగ్స్ తమ ముందు ఉంచమని సుప్రీంకోర్టు చెప్పడంతోనే వ్యాక్సిన్ ను కేంద్రం టేకప్ చేసిందని.. ఇదంతా జస్టిస్ చంద్రచూడ్ ఘనత అని ప్రశంసలు కురుస్తున్నాయి.