Begin typing your search above and press return to search.

మోడీలా మ‌న్మోహ‌న్.. మ‌న్మోహ‌న్ లా మోడీ

By:  Tupaki Desk   |   25 Nov 2016 10:30 PM GMT
మోడీలా మ‌న్మోహ‌న్.. మ‌న్మోహ‌న్ లా మోడీ
X
దేశాన్ని కుదిపేసిన త‌రువాత మొదలైన పార్ల‌మెంటు స‌మావేశాల్లో గురువారం విచిత్ర ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రాజ్య‌స‌భ‌లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు క‌నిపించాయి. 10 ఏళ్ల‌పాటు ప్ర‌ధానిగా ప‌నిచేసి మౌన‌మునిగా పేరొందిన మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ఎన్న‌డూ లేన‌ట్లుగా త‌న వాగ్దాటి ఎలా ఉంటుందో స‌భ‌కు, ప్ర‌జ‌ల‌కు చూపించారు. సుదీర్ఘ ప్ర‌సంగంతో మోడీపై నిప్పులు చెరిగారు. అదేస‌మ‌యంలో మాట‌కారిగా పేరొందిన ప్ర‌స్తుత ప్ర‌ధాని మోడీ మాత్రం మౌన‌మునిలా మారిపోయారు. మ‌న్మోహ‌న్ త‌న‌ను చీల్చిచెండాడుతుంటే ఏమాత్రం అడ్డుత‌గ‌ల‌కుండా, ఒక్క మాట కూడా ఆడ‌కుండా మౌన‌వ్ర‌తం పాటించారు.

మ‌న్మోహ‌న్ నోట్ల ర‌ద్దు త‌ద‌నంత‌రం త‌లెత్తిన సంక్షోభ ప‌రిస్థితుల‌పై ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. నోట్ల ర‌ద్దు అంశాన్ని సామాన్యుల పాలిట శాపంగా, వ్య‌వ‌స్థీకృత దోపీడీగా మారింద‌ని అభివ‌ర్ణించారు. నోట్లు ర‌ద్దు అంశాన్ని వ్య‌తిరేకించ‌కున్నా.. అమ‌లు, ప‌ర్య‌వేక్ష‌ణ‌, అనంత‌రం త‌లెత్తిన ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్ద‌డం, అంచ‌నా వేయ‌డంలో ప్ర‌భుత్వం ఘోరంగా వైఫ‌ల్యం చెందిందని సున్నిత‌మైన మాట‌ల‌తో, చుర‌క‌త్తుల్లాంటి ప‌ద‌జాలంతో క‌డిగిపారేశారు. న‌గ‌దు మార్పిడి కోసం దేశ‌వ్యాప్తంగా సంభ‌వించిన 70 మంది మ‌ర‌ణాల‌కు ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేశారు.

మ‌రోవైపు చాలారోజుల త‌రువాత స‌భ‌కు వ‌చ్చిన మోడీ నోరు తెరిచి ఒక్క మాటా మాట్లాడ‌లేదు. నోట్లో నాలిక లేని ప్ర‌ధానిగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న మ‌న్మోహ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌నాస్ర్తాలు సంధిస్తోంటే.. నోరున్న నేత‌గా పేరున్న మోడీ ప్రేక్ష‌క‌పాత్ర‌కే ప‌రిమితమయ్యారు. దీంతో పెద్ద పెద్ద మాట‌ల‌తో పెద్ద నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారంలో ప్ర‌జ‌ల‌ను క‌న్విన్స్ చేసి, ప్రతిప‌క్షాల నోరు మూయిస్తార‌ని భావించిన బీజేపీ నేత‌లకు మోడీ అలా నోరు మూసుకుని ఉండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మొత్తానికి ఇద్ద‌రు నేత‌లూ ఇలా త‌మ స‌హ‌జ స్వ‌భావాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించి ఆక‌ట్టుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/