Begin typing your search above and press return to search.

కేసీఆర్‌దా.. మోడీదా? వ‌రిపై త‌ప్పెవ‌రిది.. తేలిపోవ‌డం ఖాయం!

By:  Tupaki Desk   |   30 Nov 2021 3:30 AM GMT
కేసీఆర్‌దా.. మోడీదా?  వ‌రిపై త‌ప్పెవ‌రిది.. తేలిపోవ‌డం ఖాయం!
X
ఔను! తెలంగాణ రాష్ట్రంలో గ‌త కొన్ని రోజులుగా నెల‌కొన్న వ‌రి రాజకీయాలు తేలిపోనున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కేంద్రం కొనుగోలు చేయ‌డం లేద‌ని.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. కాదు.. త‌మ త‌ప్పులేద‌ని.. కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని రైతుల‌కు మాత్రం హెచ్చ‌రిక‌లు రావ‌డం.. వారి వ‌రికి దూరంగా ఉండ‌డం తెలిసిందే. అయితే.. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో త‌ప్పు ఎవ‌రిది? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈ వివాదం హైకోర్టు కు చేరింది. దీంతో త‌ప్పు ఎవ‌రిదో తేల్చేందుకు న్యాయ వ్య‌వ‌స్థ సిద్ధ‌మైంది.

రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ న్యాయ విద్యార్థి శ్రీకర్ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వానాకాలం పంట 40 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తామని ఎఫ్సీఐతో ఆగస్టు 17న రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కానీ ప్రభుత్వం ధాన్యం సేకరించక పోవడంతో.. కొను గోలు కేంద్రాల్లో లక్షల టన్నుల ధాన్యం పేరుకుపోయిందని.. రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వివరించారు.

పంట నష్టపోయి కొందరు రైతులు మరణించినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎఫ్సీఐని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం వివరాలు తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎఫ్సీఐలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం ఆదేశించింది. విచారణను డిసెంబరు 6కి వాయిదా వేసింది. దీంతో రైతుల‌ను ఎవ‌రు ఇబ్బంది పెడుతున్నారో..స్ప‌ష్టం అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇదిలావుంటే, గత ఒప్పందాల ప్రకారమే రాష్ట్రం నుంచి కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రైతులకు వరి విత్తనాలు అందించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ఆయన ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటని నిల‌దీశారు.

ప్రతిదీ కేంద్ర ప్రభుత్వంపై తోసేస్తున్నారని ఆరోపించారు. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోమని ఎక్కడా చెప్పలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఆందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. ఈ సీజన్‌లో చివరి బస్తా వరకు కేంద్రం కొంటుందని కిష‌న్ రెడ్డి చెప్ప‌డం గ‌మ‌నార్హం.