Begin typing your search above and press return to search.

మోడీ.. కేసీఆర్ లు ఇద్దరు భలే దెబ్బేశారుగా?

By:  Tupaki Desk   |   19 Aug 2020 1:30 AM GMT
మోడీ.. కేసీఆర్ లు ఇద్దరు భలే దెబ్బేశారుగా?
X
సంక్షేమ పథకాలకు సంబంధించి ఇటీవల కాలంలో పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని ఇన్ని కావు. ఇక.. రైతులు అడగకున్నా కూడా వారికి ఏడాదికి ఇంత మొత్తం చొప్పున భరోసా కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వాలు.. కీలకమైన బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లించే విషయంలో ప్రదర్శించిన నిర్లక్ష్యం.. తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదెలానంటే..

అనుకూలంగా ఉన్న సీజన్ తో రెట్టించిన ఉత్సాహంతో పంటలు వేశారు తెలంగాణ రాష్ట్రంలోని రైతులు. వీరికి తోడుగా కరోనా కావటంతో పలువురు ఐటీ ఉద్యోగులతో పాటు.. ఊళ్లకు వెళ్లిన వారంతా.. వ్యవసాయం మీద కాస్త ఫోకస్ పెంచారు. దీంతో.. ఈసారి పెద్ద ఎత్తున వ్యవసాయ పనులు షురూ అయ్యాయి. ఇదంతా బాగానే ఉన్నా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఇప్పుడు భారీగా షాకిచ్చాయి.

నాన్ స్టాప్ గా కురిసిన వర్షాలతో వరంగల్ రూరల్.. భూపాలపల్లి..కరీంనగర్.. ములుగు.. పెద్దపల్లి జిల్లాల్లో దాదాపుగా యాభైవేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. దాదాపుగా పదిహేను వేల ఎకరాల పత్తి పంట వరుణుడి ఖాతాలోకి కొట్టుకుపోయింది.ఇలాంటివేళ పంట బీమా తమను ఆదుకుంటుందన్న ఆలోచనలో ఉన్న రైతులకు దిమ్మ తిరిగే షాక్ తగిలినట్లైంది. ఎందుకంటే.. బీమా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని చెబుతున్నారు.
అనుకోని విపత్తుల కారణంగా రైతులు నష్టపోకుండా ఉండేందుకు పంటల బీమా తప్పనిసరి. అయితే.. పంటల పెట్టుబడికే కిందామీదా పడే రైతులు బీమామొత్తాన్ని చెల్లించలేదని పరిస్థితి. దీంతో.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పెద్ద దిక్కుగా ఉండేది. రైతులు నామమాత్రం ప్రీమియంనుచెల్లిస్తే కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం చెల్లిస్తాయి. వానాకాలం పంటకు రెండు శాతం.. యాసంగి పంటలకు 1.5 శాతం.. వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం కడితే సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని కేంద్ర.. రాష్ట్రాలు సమానంగా చెల్లించే నిబంధన ఉండేది.

అయితే.. ఇటీవల కాలంలో కేంద్రం తాను చెల్లించాల్సిన 50 శాతం ప్రీమియంను ఫిబ్రవరిలో తగ్గించుకుంది. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 25 శాతం.. లేని ప్రాంతాల్లో 30 శాతం మాత్రమే ప్రీమియం చెల్లిస్తామంటూ ఆర్డర్ పాస్ చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రాల మీద భారం పడుతుంది. కేంద్రం తన వాటాను తగ్గించుకోవటంతో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ఈ పథకం కింద నుంచి బయటకు వచ్చేశాయి. తమ మీద ఆర్థికంగా భారం పడుతుందన్నది రాష్ట్రాల వాదన. దీంతో.. తాజాగా పడిన వర్షాలకు దెబ్బ తిన్న పంటలకు నష్ట పరిహారం వస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది.
ఫసల్ బీమా పథకాన్ని కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు వదిలేసిన నేపథ్యంలో వ్యవసాయ బీమా కంపెనీ ముందుకు వచ్చింది. అయితే.. ఆ సంస్థ అన్ని పంటలకు బీమా సౌకర్యం ఇవ్వక పోవటం కూడా సమస్యేనని తేల్చి..కొన్ని పంటలకు మాత్రమే బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. కేవలం మిర్చి.. పత్తి పంటలకు మాత్రమే ప్రీమియం తీసుకుంటున్నారు. అదికూడా వర్ష బీమా పథకం మాత్రమే దీన్ని అమలు చేస్తారు. అంటే.. వర్షం కురిసినా.. కురవకపోయినా.. వర్షం ఆధారంగానే మాత్రమే బీమా పరిహారాన్ని చెల్లిస్తారే కానీ.. మరే విధంగా నష్టం జరిగినా పట్టించకోరు. ఈ మొత్తం వ్యవహారం తో రైతులు అడ్డంగా బుక్ అయినట్లు గా చెబుతున్నారు. మరి.. దీనికి ప్రభుత్వాలు ఏం సమాధానం ఇస్తాయో చూడాలి.