Begin typing your search above and press return to search.

తెగే దాకా లాగితే ఏమవుతుందో మోడీషాలకు తెలుస్తుందా?

By:  Tupaki Desk   |   1 Nov 2019 4:19 AM GMT
తెగే దాకా లాగితే ఏమవుతుందో మోడీషాలకు తెలుస్తుందా?
X
విషయం ఏదైనా కావొచ్చు.. తెగే వరకూ లాగితే తెగటం ఖాయం. అది స్నేహితుడు దగ్గర నుంచి కట్టుకున్న జీవిత భాగస్వామి వరకూ ఈ రూల్ అందరికి వర్తిస్తుంది. ఇంత చిన్న విషయాన్ని ప్రధాని మోడీ.. ఆయనకు నీడలాంటి అమిత్ షాకు మాత్రం అర్థం కాకపోవటం విశేషంగా చెప్పాలి. ముందుగా వినిపించిన అంచనాలకు భిన్నంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం వెల్లడైందని చెప్పాలి.

బీజేపీ-శివసేన రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా మహా ఓటర్లు తీర్పు ఇవ్వటం.. ఆ సత్యాన్ని గుర్తించేందుకు కమలనాథులు ససేమిరా అనటంతో ఘన విజయం తర్వాత కూడా అంతులేని సందిగ్థత ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న విషయం తెలిసిందే. మిత్రపక్షాన్ని తొక్కేసి.. ఎప్పుడూ తానే ప్రముఖంగా కనిపించాలన్న దూకుడు బీజేపీలో కాస్త ఎక్కువే. మోడీషా జమానాలో ఇది మరింత ఎక్కువైంది. వాజ్ పేయ్.. అద్వానీ హయాంలో దీనికి భిన్నమైన పరిస్థితి ఉండేది.

ఎన్నో ఏళ్లుగా బీజేపీకి అత్యంత నమ్మకమైన మిత్రపక్షంగా ఉండి కూడా ఎప్పుడు అధికారాన్ని చేపట్టే అవకాశం దక్కని శివసేన.. ఈసారి మాత్రం పవర్ ను చేతబట్టాలని తహతహలాడుతోంది. అందుకు మోడీషాలు ససేమిరా అంటున్న పరిస్థితి. బీజేపీ శాసన సభాపక్ష నేతను ఎంపిక చేయటం ద్వారా శివసేనను దారికి తెచ్చుకోవాలని డిసైడ్ అయిన మోడీషాలు అందుకు తగ్గట్లే ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇక్కడే.. బీజేపీ తీరుపై గుర్రుగా ఉన్న శివసేన నేతలు అనూహ్యంగా ఎన్సీపీతో చర్చల్ని షురూ చేశారు.

ఈ పరిణామాన్ని ఏ మాత్రం ఊహించని బీజేపీ వర్గాలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడటమే కాదు.. ఇప్పుడేం చేయాలన్న ఆలోచనలో పడ్డారు. ఈ పరిణామం మొత్తాన్ని చూస్తున్న వారు. తెగే వరకూ లాగితే ఇలాంటి పరిస్థితే ఉంటుందని.. ఈ చిన్న విషయాన్ని మోడీషాలు ఎందుకు అంగీకరించటం లేదన్న ప్రశ్నను సంధిస్తున్నారు. చేతిలో పవర్.. ఏమైనా చేయగలమన్న విశ్వాసంతో ఉన్న వారు.. వాస్తవాల్ని అంగీకరించే స్థితిలో ఉండకపోవటం కొత్తేం కాదు.ఇందుకు మోడీషాలు సైతం మినహాయింపు కాదన్న విషయం మహా ఎపిసోడ్ తో స్పష్టమైందని చెప్పక తప్పదు. అయితే.. తమ మొండితనంతో మొదటికే మోసం తెచ్చుకునేలా చేసుకోవాల్సిన అవసరం ఉందా? అన్నదే అసలు ప్రశ్న.