Begin typing your search above and press return to search.

విషెస్ చెప్పటానికి మించి ఇంకేం చేస్తార్లే మోడీజీ?

By:  Tupaki Desk   |   24 Dec 2019 7:50 AM GMT
విషెస్ చెప్పటానికి మించి ఇంకేం చేస్తార్లే మోడీజీ?
X
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తప్పకుండా జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెల్లడయ్యాయని చెప్పాలి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి బలంగా ఉన్న అధికార బీజేపీ.. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందని చెప్పాలి. మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్.. జేఎంఎం కూటమికి ఏకంగా 47 స్థానాలు చేజిక్కించుకోగా.. బీజేపీ కేవలం 25 స్థానాలకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే.

మేజిక్ ఫిగర్ 41 స్థానాలకు మరో ఆరు స్థానాలు అదనంగా ఉన్నాయి. దీంతో.. ఎలాంటి మేజిక్ లుచోటు చేసుకునే అవకాశం లేకుండా కాంగ్రెస్.. జేఎంఎం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమైంది. ఇదిలా ఉండగా జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్న జేఎంఎం నేత హేమంతే సోరెన్ కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు.

మెజార్టీ మార్క్ దాటినంతనే ప్రధాని మోడీ స్పందించి హేమంత్ సోరెన్ కు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రానికి మంచి సేవలు అందించాలని తాను ఆకాక్షింస్తున్నట్లుగా పేర్కొన్నారు. మోడీకి కాస్త ముందుగా కేంద్రమంత్రి అమిత్ షా సైతం రియాక్ట్ అయ్యారు. జార్ఖండ్ ప్రజల నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నట్లు చెప్పారు. ఓటమి ఎదురైనా మర్యాదపూర్వకంగా చేసిన ఈ ప్రకటనలు చూస్తే.. మోడీ తనకు అలవాటైన మేనేజ్ మెంట్ గురు పాత్రను పోషించినట్లు చెప్పాలి. విలువల గురించి చెప్పటమే కానీ చేతల్లో చూపించే విషయంలో రాజకీయమే మోడీని డామినేట్ చేస్తుంటుంది. అయితే.. వరుస పెట్టి తగులుతున్న ఎదురుదెబ్బల వేళ.. రాజకీయాన్ని మడిచి పెట్టేసిన చందంగా మోడీ అండ్ కో వ్యవహరించారని చెప్పాలి. హేమంత్ సోరెన్ కు శుభాకాంక్షలు చెప్పటం ద్వారా తమకు పోయే మర్యాదను కాస్త నిలబెట్టుకున్నారని చెప్పక తప్పదు.