Begin typing your search above and press return to search.

సీఎంలతో మరోసారి మోడీ భేటి.. లాక్ డౌన్ పొడిగింపే?

By:  Tupaki Desk   |   10 May 2020 12:30 PM GMT
సీఎంలతో మరోసారి మోడీ భేటి.. లాక్ డౌన్ పొడిగింపే?
X
ఎన్ని లాక్ డౌన్ లను విధించినా దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గడం లేదు. మే 17తో మూడో విడత లాక్ డౌన్ ముగుస్తోంది. అయినా కేసుల సంఖ్య 64వేలకు చేరి ఎంతకూ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే మరోసారి రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ భేటికి నిర్ణయించారు. అంతేకాదు.. ఈసారి లాక్ డౌన్ తో కుదేలైన పేదలు - చిన్న - మధ్యతరహా పరిశ్రమల్ని ఆదుకునేందుకు మరో ఆర్థిక ప్యాకేజీని మోడీ రెడీ చేస్తున్నారని తెలిసింది.

ఈనెల 12న మోడీ సీఎంలతో మరో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు రెడీ అయినట్లు సమాచారం.ముఖ్యంగా ఈసారి లాక్ డౌన్ సడలింపులపై సీఎంలతో మోడీ చర్చించనున్నారు. ఆర్థిక కార్యకలాపాల పున: ప్రారంభంపై అడిగి తెలుసుకుంటారు.

కరోనా కంట్రోల్ కాని కారణంగా దేశంలో లాక్ డౌన్ ను మరింత కాలం పొడిగించేందుకే మోడీ డిసైడ్ అయినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మరిన్ని రంగాలకు సడలింపులు ప్రకటిస్తారని సమాచారం అందుతోంది. మే 17తర్వాత ఏఏ రంగాల్లో సడలింపులు ఇవ్వాలన్న దానిపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాల అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. ఈ సారి మరిన్ని సడలింపులు ఖాయంగా కనిపిస్తోంది.

ఆర్థిక వ్యవస్థను కుదటపెట్టడం.. పేదలను విస్మరించారన్న ఆరోపణల నేపథ్యంలో మోడీ మరో ప్యాకేజీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. చిన్న - మధ్యతరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీ ఇవ్వనున్నారు.

ఇక విద్యుత్ చట్టాలపై నిలదీసేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలు రెడీ అవుతున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా కేంద్రం కొత్తగా తెస్తున్న విద్యుత్ ముసాయిదా చట్టంపై మోడీకి షాకిచ్చేందుకు కొందరు సీఎంలు సిద్ధమైనట్లు తెలిసింది. వలస కూలీల తరలింపు వ్యవహారంలో కూడా కేంద్రంపై పలువురు సీఎంలు విమర్శలు చేశారు. దీంతో ఈసారి వీడియో కాన్ఫరెన్స్ లో మోడీని నిలదీసేందుకు సీఎంలు అంతా రెడీ అవుతున్నట్లు తెలిసింది.