Begin typing your search above and press return to search.

బాబుకు కౌంటర్లు రెడీ చేసుకుంటున్న మోదీ

By:  Tupaki Desk   |   8 Jan 2018 5:42 PM GMT
బాబుకు కౌంటర్లు రెడీ చేసుకుంటున్న మోదీ
X
ఏడాదిన్నర తరువాత ప్రధాని మోదీని కలవనున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ భేటీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే... చంద్రబాబు అనుకున్నంత ఈజీగా ఈ భేటీ ఉండకపోవచ్చని తాజా పరిణామాలు చెప్తున్నాయి. నిజానికి తలాక్ బిల్లు రాజ్యసభలోకి రాకుండా ఉంటే చంద్రబాబుకు మోదీ అపాయింట్మెంటు ఇప్పుడు కూడా దొరికేది కాదన్నది ఒక మాట. అయితే.. తలాక్ బిల్లు విషయంలో టీడీపీ అడ్డం తిరగడాన్ని మోదీ ఏమీ అంత ఈజీగా తీసుకోలేదని తెలుస్తోంది. ఇలాంటి విషయాల్లో ఒకసారి తలొగ్గితే పదేపదే చంద్రబాబు ఇలాంటి ఎత్తుగడలే వేస్తారని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే మోదీతో భేటీ కోసం చంద్రబాబు రావడానికి ముందే ఏపీలో ఏం జరుగుతోందో మొత్తం తెలుసుకునే పనిలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే ఉమ్మడి రాష్ర్టాల గవర్నరు నరసింహన్‌ దిల్లీ వెళ్తున్నారని వినిపిస్తోంది. షెడ్యూలు ప్రకారం ఈ నెల 17న చంద్రబాబు మోదీతో భేటీ కావాల్సి ఉంది. కానీ, అంతకుముందే గవర్నరు నరసింహన్ దిల్లీ వెళ్తున్నారు. దీంతో.. చంద్ర‌బాబు మీటింగ్ కంటే ముందే గ‌వ‌ర్న‌ర్‌ని ర‌మ్మ‌ని ప్ర‌ధాని కార్యాల‌యం పిల‌వ‌డం వెనుక అంతర్య‌మేంట‌ని ప్ర‌శ్న‌లు ఇప్పుడు మొద‌ల‌య్యాయి.

ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు - పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరుగుతోంది.. తెలంగాణతో చంద్రబాబు సంబంధాలు ఎలా ఉన్నాయి. జగన్ పాదయాత్ర... పవన్ కల్యాణ్ హడావుడి వంటి అన్నిటిపైనా గవర్నరు ప్రధానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఏం చెప్పినా నమ్మేయకుండా వాస్తవాలు ముందే తెలుసుకునేందుకు గాను గవర్నరును పిలిచినట్లు తెలుస్తోంది.

దీంతో చంద్రబాబును మోదీ ఏమాత్రం నమ్మడం లేదని.. అందుకే ఆయన చెప్పబోయే అంశాలకు సంబంధించి ముందే సమాచారం తెప్పించుకుంటున్నారని ఏపీ బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రధానితో భేటీ జరిగే రోజున చంద్రబాబుకు ఎంత ప్రయరిటీ ఇస్తున్నారు... నమ్ముతున్నారా లేదా అన్నది తేలిపోనుంది.