Begin typing your search above and press return to search.

డీపీలు పెద్దగా కనిపించట్లేదు బాస్.. ఎందుకంటారు?

By:  Tupaki Desk   |   4 Aug 2022 4:15 AM GMT
డీపీలు పెద్దగా కనిపించట్లేదు బాస్.. ఎందుకంటారు?
X
మిగిలిన వారి సంగతి పక్కన పెడితే.. ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ నోటి నుంచి వచ్చే మాటకు వచ్చే స్పందన ఎంతన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాక్ డౌన్ కు ముందు.. ప్రయోగాత్మకంగా దేశ వ్యాప్తంగా ఒక రోజు లాక్ డౌన్ నిర్వహించటం.. దానికి సంబంధించి ఒక డేట్ ను ఫిక్స్ చేసిన సందర్భంగా జరిగిన ప్రచారం.. దానికి సంబంధించిన పోస్టు వైరల్ అయిన విధానం చూసిన చాలామందికి నోట మాట రాని పరిస్థితి. బీజేపీ సోషల్ మీడియా.. అందునా మోడీ మాటలకు అనుగుణంగా బలమైన వాదనను వినిపించే తీరు మిగిలిన వారికి చాలా భిన్నమని చెప్పాలి.

వారి ప్రచారంలో.. దేశ భక్తి.. దేశ ద్రోహి.. లాంటి విభజనతో పాటు.. మోడీ నోటి మాటకు ఉన్న శాస్త్రీయత లెక్కను వివరించే వైనం చూస్తే.. మోడీ సోషల్ సైన్యం తెలివికి జోహార్లు అర్పించకుండా ఉండలేమని చెప్పాలి. ఒకరోజు లాక్ డౌన్ డేట్ మీద బోలెడన్ని ప్రచారాలు.. ఆ రోజు సూర్యుడి సూర్యరశ్శితో కలిగే మేజిక్.. దాంతో కరోనా వైరస్ పరుగులు తీస్తూ భారత్ సరిహద్దుల్ని దాటేస్తుందన్న మాటలు విన్న చాలామంది నిజమని నమ్మారే కానీ.. అదే నిజమైతే.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఇలాంటి పనులు ఎందుకు చేయరన్న చిన్న లాజిక్ ను ప్రశ్న రూపంలో సంధించింది.

మరి.. ముందుగా జరిగిన ప్రచారానికి తగ్గట్లు.. తర్వాత ఫలితాన్ని ప్రశ్నించే వారు లేకపోవటంతో వారి కోతలకు క్వశ్చన్ చేసే వారే లేని పరిస్థితి. అంతేనా.. మోడీ నోటి నుంచి దీపాలు వెలిగించమని చెప్పినా.. గంటలు మోగించమని చెప్పినా.. దానికి సంబంధించిన 'విశిష్ఠత' ఫలానా అంటూ ప్రచారం చేసే వారి తీరు బోలెడంత ఆసక్తికరంగా ఉంటుందని చెప్పాలి. మొన్న ఆదివారం వేళ.. దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో ప్రధాని మోడీ.. మరో టాస్కు ఇవ్వటం తెలిసిందే. ఆగస్టు 2 నుంచి దేశ ప్రజలు తమ సోషల్ మీడియా ఖాతాల డీపీల్ని త్రివర్ణ పతాకంతో ఉంచాలని కోరటం తెలిసిందే.

షాకింగ్ అంశం ఏమంటే.. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన ఆగస్టు 2 దాటి మరో రెండురోజులైంది. పలువురు డీపీలు జాతీయ పతాకంలోకి మారింది లేదు. ఆ మాటకు వస్తే.. పదిలో ఇద్దరు ముగ్గురు డీపీలు మాత్రమే త్రివర్ణ పతాకంగా ఉండం.. మిగిలిన వారు ఎప్పటిలానే తమకు తోచినట్లు ఉంచటం కనిపిస్తోంది. వ్యక్తిగత ఖాతాలతో పోలిస్తే.. గ్రూపులకు సంబంధించిన డీపీల్లో మాత్రం మోడీ మాటను ఎక్కువగా ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇది కూడా ప్రతి పది గ్రూపుల్లో నాలుగైదు మంది తప్పించి.. మెజార్టీ మాత్రం మోడీ మాటను పెద్దగా పట్టించుకున్నది లేదన్నట్లుగా ఉండటం గమనార్హం. ఎందుకిలా? ఇప్పుడేమైందన్నది ప్రశ్నగా మారింది.

సోషల్ మీడియా ఖాతాలో డీపీ అన్నది వ్యక్తిగతమైనది. దేశ ప్రజలందరిలోనూ దేశం మీద భక్తి.. ప్రేమ అంతకు మించిన భావోద్వేగం చాలానే ఉంటుంది. కానీ.. ఫలానా చేస్తేనే దేశభక్తి ఉందన్నట్లుగా వ్యవహరించటంతోనే అన్నట్లుగా చెప్పటం చాలామందిని కనెక్టు చేయలేకపోయింది. అంతేకాదు.. డీపీతో ఏం చెప్పొచ్చు? అన్న ప్రశ్నకు సరైన సమాధానం రాకపోవటంతో పాటు.. ఇటీవల కాలంలో పెరిగిన ధరలు.. మంట పుట్టిస్తున్న పెట్రోల్.. డీజిల్ ధరలు కూడా మోడీ మాటలకు పెద్దగా రియాక్షన్ రాకుండా ఉంటానికి కారణంగా భావిస్తున్నారు.

ఏమైనా.. మోడీ నోటి నుంచి మాట వస్తే చాలు.. పూనకం వచ్చినోళ్ల మాదిరి ఫాలో అయ్యే చాలామందిలో ఈసారి మాత్రం అందుకు భిన్నమైన మౌనం సమాధానంగా కనిపించటం ఆసక్తికరంగా మారింది. మోడీ మాటకు ముందుగా వీరావేశాన్ని ప్రదర్శించే బ్యాచ్ అందుకు భిన్నంగా వ్యవహరించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పక తప్పదు.