Begin typing your search above and press return to search.

కోవాక్స్‌ ద్వారా భారత్ కి మోడర్నా ‌ వ్యాక్సిన్

By:  Tupaki Desk   |   17 Nov 2020 10:30 AM GMT
కోవాక్స్‌ ద్వారా భారత్ కి మోడర్నా ‌ వ్యాక్సిన్
X
కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి తన వ్యాప్తిని పెంచుకుంటూ పోతుంది. ఇదిలా ఉంటే .. కరోనా వ్యాక్సిన్ల తయారీ ప్రయోగాల్లో దూసుకుపోతోన్న అమెరికా బయోటెక్ సంస్థల నుంచి వారం రోజుల్లోనే రెండో ప్రకటన వెలువడింది. ఫైజర్ ఫార్మాసూటికల్స్‌ తన జర్మన్ భాగస్వామి బయోఎన్‌టెక్‌తో కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 90 శాతం కన్నా ఎక్కువ ప్రభావం చూపిందని నవంబర్ 9న ప్రకటన చేయగా.. ఇప్పుడు మరో శుభవార్తను అమెరికాకే చెందిన మోడెర్నా బయోటెక్ అందించింది. కరోనా ను నివారించడంలో ప్రయోగాత్మక టీకా 94.5% ప్రభావవంతంగా ఉందని మోడర్నా బయోటెక్ సంస్థ తెలిపింది.

డిసెంబర్ నెల నుంచే సదరు వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి అందుబాటులోకి వస్తుందని, ఈ మేరకు అనుమతుల కోసం ప్రభుత్వానికి అప్పీలు కూడా చేస్తామని తెలిపింది. తమ ప్రయోగాలకు సంబంధించిన పూర్తి డేటాను అతి త్వరలోనే విడుదల చేస్తామని చెప్పింది. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో సీఈపీఐ నుంచి గతంలోనే మోడర్నా ఇంక్‌ కు నిధుల సహాయం అందినట్లు వివరించాయి. సీఈపీఐ కోవాక్స్‌ లో భాగంకావడంతో ఇండియా సైతం వ్యాక్సిన్‌ ను పొందనున్నట్లు తెలియజేశాయి. వచ్చే ఏడాది చివరికల్లా కోవాక్స్‌ సౌకర్యాల ద్వారా పేద, మధ్యాదాయ దేశాలకు 2 బిలియన్‌ వ్యాక్సిన్లను సరఫరా చేయాలని కోవాక్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెల్త్ ‌కేర్‌ రంగ నిపుణులు తెలియజేశారు.

ఈ ఏడాది జనవరిలో మోడర్నా ఇంక్‌కు సీఈపీఐ 1 మిలియన్‌ డాలర్లను విడుదల చేసింది. తద్వారా మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో వ్యాక్సిన్‌ అభివృద్ధికి పాక్షికంగా నిధులు అందజేసింది. ఈ నిధుల సమీకరణ కారణంగా మోడర్నా ఇంక్‌ పేద, మధ్యాదాయ దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయవలసి ఉన్నట్లు నిపుణులు తెలిపారు. 2016లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సీఈపీఐ రూపొందింది. వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీ, నిల్వలకు ఉద్ధేశించి సీఈపీఐను ఏర్పాటు చేశారు. ఫార్మా దిగ్గజాలైన ఫైజర్, మోడెర్నా సంస్థలు తమ వ్యాక్సిన్లు 90 శాతానికిపైగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వెల్లడించిన నేపథ్యంలో అమెరికాలోని ప్రముఖ సైంటిస్ట్, వైరాలజీ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ చివరలో అమెరికాలోని ప్రాధాన్యతా సమూహాలకు ఈ టీకాలను అందించే అవకాశముందని ఫౌచీ చెప్పారు