Begin typing your search above and press return to search.
థియేటర్లో అధిక రేట్లు...మేనేజర్ పై దాడి!
By: Tupaki Desk | 29 Jun 2018 1:56 PM GMTమల్టీప్లెక్స్ లు - సినీ ప్లెక్స్ లలో ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలంటే జేబు గుల్లవడం ఖాయమన్న సంగతి తెలిసిందే. టిక్కెట్టు రేటు ఓ మోస్తరు గా ఉన్నా కూడా....అక్కడ అమ్మే స్నాక్స్, కూల్ డ్రింక్స్ - ఇతర ఆహార పదార్థాలను కొనాలంటే మాత్రం భారీగా ఖర్చు చేయాల్సిందే. ఎంఆర్పీ రేట్లకంటే చాలా అధికంగా ఆ రేట్లుండడమే అందుకు కారణం. అయితే, థియేటర్లలో అధిక రేట్లకు ఆహారపదార్థాల అమ్మకాలను అరికట్టాలని ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ యథేచ్ఛగా ఆ అమ్మకాలు అలాగే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పుణెలోని ఓ మల్టీఫ్లెక్స్ లో పనిచేస్తోన్న ఓ అసిస్టెంట్ మేనేజర్ పై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎమ్ ఎన్ ఎస్) కార్యకర్తలు దాడి చేశారు. అధిక ధరలకు ఆహార పదార్థాలు అమ్మడంపై అతడు దురుసుగా సమాధానమివ్వడంతో వారు అతడిని చితకబాదారు. దాడి చేసిన వారిలో ఆ పార్టీ మాజీ కార్పొరేటర్ జోషి కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పూణేలోని సేనాపతి బాపత్ రోడ్ లోని పీవీఆర్ ఐకాన్ మల్టీఫ్లెక్స్ లో ఈ ఘటన జరిగింది. థియేటర్లలో అధిక రేట్లకు ఆహార పదార్థాలను అమ్మడంపై హైకోర్టు ఉత్తర్వులున్నాయని - అన్ని థియేటర్ల మాదిరిగానే అక్కడకు వెళ్లామని మాజీ కార్పొరేటర్ జోషీ తెలిపారు. ఆ థియేటర్లో అధిక ధరల గురించి అసిస్టెంట్ మేనేజర్ ను ప్రశ్నించామని - దానికి అతడు దురుసుగా జవాబిచ్చాడని అన్నారు. డబ్బున్నవాళ్లే థియేటర్ కు రావాలని అవమానకరరీతిలో మాట్లాడాడని ఆరోపించారు. అతడి సమాధానం తమకు ఆగ్రహం తెప్పించిందని - దీంతో కొందరు ఎంఎన్ ఎస్ కార్యకర్తలు అతడిపై చేయి చేసుకున్నారని వెల్లడించారు. అయితే, ఈ ఘటనలో అసిస్టెంట్ మేనేజర్ పై దాడికి పాల్పడిన వారందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందని కొందరు అంటున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోరని....సినిమాకు వెళితే పర్సు ఖాళీ అవుతోందని....మరి కొందరు దాడి చేసిన వారికి మద్దతు తెలుపుతున్నారు.