Begin typing your search above and press return to search.

ఈ టీడీపీ ఎమ్మెల్సీకి రౌడీయిజం కూడా తెలుస‌ట‌!

By:  Tupaki Desk   |   21 Jan 2017 7:10 AM GMT
ఈ టీడీపీ ఎమ్మెల్సీకి రౌడీయిజం కూడా తెలుస‌ట‌!
X

ఇటీవ‌ల బాలీవుడ్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన *వంగ‌వీటి* పుణ్య‌మా అని బెజ‌వాడ రౌడీయిజంపై జోరుగానే చ‌ర్చ సాగింది. దివంగ‌త నేత వంగవీటి మోహ‌న‌రంగ జీవిత చరిత్ర ఆధారంగానే ఈ సినిమా తెర‌కెక్కింద‌ని చెప్పుకున్నా... అస‌లు రాంగోపాల్ వ‌ర్మ ఆ విష‌యాన్ని వ‌దిలేసి... బెజ‌వాడ రౌడీయిజం అంటే ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని చూపేందుకే ప్రాధాన్యం ఇచ్చార‌న్న విమ‌ర్శ‌లు కూడా లేకపోలేదు. అయినా వ‌ర్మ సినిమా వ‌చ్చింది... పోయింది... ఇప్పుడెందుకు ఈ ప్ర‌స్తావ‌న అంటే... ఏపీలో అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ ఎమ్మెల్సీ, కృష్ణా జిల్లా నేత వైవీబీ రాజేంద్ర‌ప్ర‌సాదే ఈ విష‌యాన్ని మ‌రోమారు ప్ర‌స్తావించుకునేలా చేశార‌ని చెప్పాలి.

తాను కొనుక్కున్న ఓ కొత్త కారుకు ఫ్యాన్సీ నెంబ‌ర్ కోసం వైవీబీ మామూలుగా య‌త్నించలేదు. తాను కోరుకున్న నెంబ‌రును ద‌క్కించుకునేందుకు వైవీబీ ఏకంగా బెదిరింపుల‌కు కూడా దిగార‌ట‌. ఈ వ్య‌వ‌హారం మొత్తాన్ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కుటుంబం ఆధ్వ‌ర్యంలోని సాక్షి ప‌త్రిక కెమెరామెన్లు షూట్ చేసేశారు. ఆ త‌ర్వాత స‌ద‌రు వీడియో సాక్షి ఛానెల్ స‌హా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది. దీంతో నిన్న సాయంత్రం మీడియా ముందుకు వ‌చ్చిన వైవీబీ... ఆ ఘ‌ట‌న‌పై కాస్తంత వివ‌ర‌ణ ఇస్తూనే... త‌న‌లోని రెండో కోణాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నారు.

ఫ్యాన్సీ నెంబ‌రు కోసం తానేమీ రౌడీయిజం చేయ‌లేద‌ని చెబుతూనే... తానే రౌడీయిజం చేస్తే... ప‌రిస్థితి మ‌రోలా ఉంటుంద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. విజ‌యవాడ‌లోని రవాణా శాఖ కార్యాల‌యం వ‌ద్ద జ‌రిగిన ఆ గొడ‌వ‌లో తాను కృష్ణా జిల్లా యాస‌లో మాత్ర‌మే మాట్లాడాన‌ని చెప్పిన వైవీబీ... తాను రౌడీయిజం మాత్రం చేయ‌లేద‌ని చెప్పుకొచ్చారు. అయినా త‌న‌కు కూడా రౌడీయిజం తెలుస‌ని, తాను రౌడీయిజం చేసి ఉంటే... తాను మాట్లాడిన వ్య‌క్తి మ‌ళ్లీ అంద‌రి ముందుకు వ‌చ్చేవాడు కాద‌ని కూడా చెప్పుకొచ్చారు. అయినా జ‌రిగిన గొడ‌వ చాలా చిన్న‌దేన‌ని చెప్పిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌... ఈ చిన్న గొడ‌వ‌ను వైసీపీ భూత‌ద్దంలో పెట్టి చూపిస్తోంద‌ని కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/