Begin typing your search above and press return to search.

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ.. హుజూరాబాద్ గులాబీ అభ్యర్థి ఎవరు?

By:  Tupaki Desk   |   2 Aug 2021 3:53 AM GMT
కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ.. హుజూరాబాద్ గులాబీ అభ్యర్థి ఎవరు?
X
లెక్కలు తేలుతున్నాయి. అందరి అంచనాలకు భిన్నంగా కౌశిక్ రెడ్డిని ఆగమేఘాల మీద ఎమ్మెల్సీగా ఎంపిక చేయటమే కాదు.. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టేందుకు వీలుగా గవర్నర్ తో మాట్లాడతానని ప్రకటించటం ద్వారా.. కేసీఆర్ కీలక వ్యూహాన్ని అమలు చేస్తున్నారని చెప్పక తప్పదు. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో.. ఎవరైనా నేతకు పదవిని కట్టబెట్టే వేళలో.. తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు ముందే చెప్పేయటం కనిపించదు. అందుకు భిన్నంగా కౌశిక్ రెడ్డి విషయంలో మాత్రం కేసీఆర్ తన రోటీన్ తీరుకు భిన్నంగా వ్యవహరించారు.

మంత్రివర్గ సమావేశంలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇస్తున్నామని చెప్పటం చూస్తే.. హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం ఎలా సాధించొచ్చన్న ప్రణాళికను అంతో ఇంతో రీవీల్ చేసి ఉంటారని చెప్పొచ్చు. కౌశిక్ కు ఎమ్మెల్సీ పదవిని ఇస్తున్నామన్న ప్రకటనతో పాటు.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు ధీమాను పార్టీ నేతలకు కల్పించేందుకు వీలుగా ఆయనీ ప్రకటన చేసి ఉంటారని చెప్పాలి.

ఇంతకీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ అభ్యర్థి ఎవరై ఉంటారు? దాని లెక్క ఏమిటన్న విషయానికి రాజకీయ వర్గాలు వినిపిస్తున్న వాదనలు ఆసక్తికరంగా మారాయి. ఈ నియోజకవర్గంలో 2.26 లక్షల మంది ఓటర్లు ఉంటే.. అందులో బీసీలు 1.03లక్షలు.. ఓసీలు 43వేల మంది ఉంటే.. ఎస్సీ ఓటర్లు 51 వేల మంది ఉంటారు. ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు 33,500.. ఎస్టీ ఓటర్లు నాలుగు వేలు కాగా.. మైనార్టీ ఓటర్లు 9 వేల మంది వరకు ఉంటారని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే.. కేసీఆర్ తాజాగా తీసుకొచ్చిన దళిత బంధు పథకంలో భాగంగా 51 వేల మంది మనసు దోచేలా నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ఇక.. నియోజకవర్గంలో కీలకమైన బీసీల్లో మెజార్టీ ఎటు నెగ్గితే వారిదే విజయం అవుతుంది.

దీనికి తోడు నిఘా వర్గాలు ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఈటెల జోరు ఎక్కువగా ఉందని.. ఆయనకు చెక్ చెప్పాలంటే బీసీ వర్గాలకు చెందిన నేతను అభ్యర్థిగా బరిలోకి నిలపాలన్న మాట వినిపిస్తోంది. ఈ కారణంగానే.. ఇప్పటికే అభ్యర్థి అన్న ప్రచారం జరిగిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇస్తామన్న ప్రకటనతో.. కొత్త ముఖం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున తెర మీదకు రానుందని చెప్పాలి. నియోజకవర్గంలోని బీసీల్లో అత్యధికంగా ఉన్న పద్మశాలి.. ముదిరాజ్.. మున్నూరుకాపు.. గౌడ.. యాదవ.. ఇతర బీసీ కులాల ఓట్లు కారుకు పడేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్ుల చెబుతున్నారు.

కౌశిక్ రెడ్డి కాకుండా బరిలోకి దిగుతారంటూ వినిపించిన పేర్లలో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు భార్య సరోజనమ్మ.. ముద్దసాని పురుషోత్తంరెడ్డి.. పెద్దిరెడ్డి లాంటివి వచ్చినా అవేమీ కాదని.. సామాజిక సమీకరణాల విషయంలో కేసీఆర్ మరింత కచ్ఛితంగా ఉన్నట్లు చెబుతున్నారు. తాను ఈ మధ్యనే టేకప్ చేసిన దళిత బంధుతో దళితులు పక్కాగా గులాబీ పార్టీ పక్షానే ఉంటారని.. నియోజకవర్గంలో కీలకమైన బీసీలకు టికెట్ ఇవ్వటం ద్వారా.. ఈటల కోటను సొంతం చేసుకోవాలన్న ప్లాన్ ను కేసీఆర్ అమలు చేస్తున్నట్లుగా చెప్పాలి.