ఉమ్మడి అనంతపురం జిల్లా హిందుపురంలో సంచలనం సృష్టించిన వైసీపీ నేత రామకృష్ణారెడ్డి హత్యకేసులో ఎంఎల్సీ మహమ్మద్ ఇక్బాల్ పీఏ గోపీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలోని ఆధిపత్య గొడవల కారణంగా రెడ్డికి ఎంఎల్సీ ఇక్బాల్ కు విభేదాలు బాగా పెరిగిపోయాయనే ప్రచారం జరుగుతోంది. తన ఆధిపత్యానికి అడ్డుపడుతున్నాడని, బాగా చికాకులు సృష్టిస్తున్నాడనే మంటతోనే ఇక్బాల్ తన మద్దతుదారులను ఉసిగొల్పినట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి.
రెడ్డి హత్యకు గురికాకముందు కూడా ఇక్బాల్ పీఏ, మద్దతుదారుల కారణంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు బయటపడింది. హత్య జరిగినతర్వాత మృతుడి కుటుంబసభ్యులు డైరెక్టుగా ఇక్బాల్ తో పాటు ఆయన పీఏ గోపీకృష్ణ మీదే ఆరోపణలుచేశారు. అయితే పోలీసులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. హత్యకేసులో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారంతే. బాదిత కుటుంబసభ్యులు రాతమూలకంగా గోపీకృష్ణపై ఫిర్యాదు చేసినా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు.
అయితే హత్యకు ముందు ఇక్బాల్ పీఏ గోపీకృష్ణతో మద్దతుదారులకు మధ్య జరిగిన మొబైల్ సంభాషణలు బయటపడటం సంచలనంగా మారింది. ఆ సంభాషణల్లో రెడ్డి హత్య గురించి మాట్లాడుకున్న విషయం స్పష్టంగా వినిపించింది. ఎప్పుడైతే మొబైల్ ఆడియో బయటపడిందో అదికాస్త వైరల్ గా మారింది. దాంతో వేరే దారిలేక పోలీసులు రంగంలోకి దిగి చివరకు గోపీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. గడచిన పదిరోజులుగా పట్టణంలోనే ఉన్నప్పటికీ గోపీకృష్ణను పట్టించుకోని పోలీసులు ఇపుడు మాత్రం హడావుడిగా అదుపులోకి తీసుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.
ఈ ఆడియో కూడా ఎలాగ బయటపడిందంటే ఇప్పటికే పోలీసుల విచారణలో ఉన్న కొందరి కుటుంబసభ్యులే ఈ ఆడియోను విడుదలచేశారనే ప్రచారం పెరిగిపోతోంది. ఎవరికోసమో తమ కుటుంబసభ్యులు హత్యలో పాత్రదారులుగా మారినపుడు సూత్రదారులు మాత్రం దర్జాగా బయట తిరగటం ఏమిటని కొందరికి బాగా మండుతోందట. అందుకనే ఉద్దేశ్యపూర్వకంగానే గోపీకృష్ణ మాట్లాడిన ఆడియోను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా ఇలాంటి ఆడియోలు చాలా ఉన్నాయట. మరి వాటిల్లోని సారాంసం ఏమిటోబయటపడితే అవి ఇంకెంత సంచలనమవుతాయో చూడాలి.