Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూజివ్: చంద్రబాబుకు తేల్చి చెప్పిన మాగుంట!

By:  Tupaki Desk   |   16 Feb 2019 10:53 AM GMT
ఎక్స్ క్లూజివ్: చంద్రబాబుకు తేల్చి చెప్పిన మాగుంట!
X
తను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలంటే.. పలు మార్పులు చేయాలని.. తను చెప్పినట్టుగా చేస్తేనే టీడీపీ తరఫు నుంచి ఒంగోలు ఎంపీగా పోటీ చేయడం లేకపోతే లేదు.. అని చంద్రబాబు నాయుడుకు తేల్చి చెప్పాడట మాగుంట శ్రీనివాసులు రెడ్డి. చంద్రబాబుతో సమావేశంలో ఈ విషయాల గురించి మాగుంట వివరించి చెప్పారట. తను ఇప్పటి వరకూ చేయించుకున్న సర్వేల ప్రకారం.. ఒంగోలు ఎంపీ సీటు పరిధిలో టీడీపీకి అనుకూలత లేదు అని తేల్చేశాడట మాగుంట. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడు చోట్ల మాత్రమే టీడీపీకి అనుకూలత ఉందని, నాలుగు చోట్ల పార్టీ పరిస్థితి బాగోలేదని మాగుంట తేల్చి చెప్పాడట.

ఆ నాలుగింటిలోనూ తను చెప్పిన వాళ్లకు టికెట్ ఇస్తే.. ఎంపీగా పోటీ చేసే తనకు కొంత అనుకూలత ఉంటుందని చెప్పాడట. వైసీపీ మెజారిటీ ఆ నాలుగు చోట్లా తగ్గించాలంటే తను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని మాగుంట తేల్చి చెప్పినట్టుగా సమాచారం.

ఒంగోలు - కొండెపి - దర్శిల్లో మాత్రమే టీడీపీకి అవకాశాలు ఉన్నాయట. గిద్దలూరులో అశోక్ రెడ్డిని మార్చాలని - మార్కాపురంలో నారాయణ రెడ్డిని మార్చాలని - ఎర్రగొండపాలెంటలో డేవిడ్ రాజును - కనిగిరిలో కదిరి బాబూ రావును మార్చాలని చంద్రబాబు నాయుడుకు చెప్పాడట మాగుంట.

మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డిని తను తెచ్చుకుంటున్నట్టుగా - ఆయన వల్ల అక్కడ మెరుగైన ఫలితాలు రావొచ్చని చెప్పారట. గిద్దలూరులో అశోక్ రెడ్డికి బదులుగా బీసీ నేతను ఎవరినైనా - అందులోనూ యాదవ సామాజికవర్గానికి చెందిన వారికి లేదా వేరే రెడ్డి సామాజికవర్గం నేతకు అవకాశం ఇవ్వాలని చెప్పాడట.

కనిగిరిలో కదిరి బాబూరావు బదులు ఉగ్ర నరసింహారెడ్డి ని తీసుకుని వస్తే యాభై శాతం రెడ్డి సామాజికవర్గం ఓట్లు పడతాయని చెప్పాడట. అలాగే ఎర్రగొండ పాలెంలో నెల్లూరుకు చెందిన రిటైర్డ్ ఐఆర్ ఎస్ అధికారి కి అవకాశం ఇస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతాన్ని తగ్గించవచ్చు అని చెప్పాడట.

ఈ మేరకు తను చెప్పినట్టుగా మార్పులు చేస్తే.. తను ఒంగోలు నుంచి టీడీపీ తరఫున పోటీ చేయడానికి ఓకే అని - అలా కాకపోతే తను పోటీ చేయడానికి నో.. అని మాగుంట చెప్పాడట. బాబుతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో ఏమీ మాట్లాడ లేదు. అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ఎక్స్ క్లూజివ్ గా ఈ సమాచారాన్ని రాబట్టడం జరిగింది.