Begin typing your search above and press return to search.

అన్నా.. తొందరపడకు.. నోరు జారకు అన్న కవితక్క ఇప్పటివరకు ఫాలో అయ్యారా?

By:  Tupaki Desk   |   22 Dec 2022 5:00 AM GMT
అన్నా.. తొందరపడకు.. నోరు జారకు అన్న కవితక్క ఇప్పటివరకు ఫాలో అయ్యారా?
X
అందుకే అంటారు వేలెత్తి చూపించటం చాలా ఈజీ అని. కానీ.. అదే వేలు తమవైపు చూపే వేళలో పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తాజాగా ఈడీ చార్జిషీట్ లో కవిత పేరు రావటం చర్చనీయాంశమైంది. దీనిపై రాజకీయ కాక మొదలైంది.

కవిత పేరు ఈడీ చార్జిషీట్ లో 28 సార్లు ప్రస్తావించిన అంశాన్ని హైలెట్ చేసిన మీడియా క్లిప్ ను పోస్టు చేసిన బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ''చార్జిషీట్ లో లిక్కర్ క్వీన్ పేరును 28 సార్లు ప్రస్తావించారంట'' అని ట్వీట్ చేయటం.. దానికి బదులుగా స్పందించిన కవిత.. 'అన్నా.. తొందరపడకు.. మాట జారకు. 28సార్లు నా పేరు చెప్పించినా.. 28 వేల సార్లు చెప్పించినా అబద్ధం నిజం కాబోదు' అంటూ కాస్తంత ఘాటుగా బదులు ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన రాజగోపాల్.. 'నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా. నువ్వు లిక్కర్ స్కామ్ లో ఉన్నది నిజం. జైలుకు వెళ్లటం ఖాయం. నిన్ను నీ నాయన.. నీ అన్న సహా ఎవరు కాపాడలేరు' అని పేర్కొన్నారు.

మొత్తంగా ఈ ట్వీట్లపై వాద ప్రతివాదాలు మొదలయ్యాయి. ఎవరికి వారు వారి వాదనను వినిపిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కొందరు కవితకు అనుకూలంగా వాదనలు వినిపిస్తే.. మరికొందరు రాజగోపాల్ వ్యాఖ్యలకు దన్నుగా నిలిచారు.

అయితే.. ఈ రెండు వాదనల్ని పక్కన పెడితే.. తన రాజకీయ ప్రయాణంలో ఇప్పటివరకు కవిత చేసిన వ్యాఖ్యలు.. విమర్శలు.. ఆరోపణలను చూస్తే... ఆమె దూకుడుగానే వ్యవహరిస్తుంటారన్నది అర్థమవుతుంది.

తాను గతంలో ఎంతోమంది మీద విమర్శలు.. ఆరోపణలు న్యాయబద్ధంగా.. కోర్టుల్లో తేలిన తర్వాత అనలేదు కదా? ఏదైనా ఘటన జరిగిన వెంటనే రియాక్టు కావటం.. ప్రత్యర్థుల మీద నిప్పులు చెరిగే వారు కదా? ఆరోపణలు వచ్చినంతనే ఘాటుగా రియాక్టు అయ్యే అలవాటున్న కవిత.. ఈ రోజున తనను ఉద్దేశించి విమర్శలు చేసే వారిని మాట జారకు అన్నా అనేస్తున్న వైనం విస్మయానికి గురి చేస్తోంది.

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎవరూ కూడా ఏ విషయం మీదా ఆచితూచి అన్నట్లుగా రియాక్టు కావటం లేదు. ఎవరికి వారు వారిదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఈ విషయాలేమీ కవితకు కొత్తకాదు. ఎందుకంటే ఆవిడ కూడా ఈ దూకుడు రాజకీయాల్లో ఒక భాగమే అన్నది మర్చిపోకూడదు. తనకు అవకాశం దొరికిన ప్రతిసారీ ఇదే రీతిలో విరుచుకుపడ్డారు. అలాంటప్పుడు.. 'నేను ఎవరినైనా ఏమైనా అనేస్తా కానీ.. నన్ను మాత్రం ఎవరూ ఏమీ అనకూడదు' అన్నది సరికాదు కదా? అన్నది కవితక్క అభిప్రాయమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.