Begin typing your search above and press return to search.

కవిత నోట హనుమాన్ చాలీసా మాటలు.. భలే ఆసక్తికరంగా ఉన్నాయ్

By:  Tupaki Desk   |   10 May 2023 5:09 PM GMT
కవిత నోట హనుమాన్ చాలీసా మాటలు.. భలే ఆసక్తికరంగా ఉన్నాయ్
X
కొందరి పుణ్యమా అని మంచిగా ఉండే విషయాలు కూడా తేడా వచ్చేస్తాయి. బీజేపీ పుణ్యమా అని ఇప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం సైతం పెద్ద ఇబ్బందిగా మారింది. నిన్నటికి నిన్న కర్ణాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనాల్ని జట్టుకట్టించేందుకు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని పిలుపునివ్వటం.. దానికి బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటం తెలిసిందే. దీంతో.. రియాక్టు అయిన కేంద్ర ఎన్నికల సంఘం.. హనుమాన్ చాలీసాను నిషేధిస్తున్నట్లుగా పేర్కొంది.

హనుమాన్ చాలీసా పఠించటంపై ఆంక్షలు పెట్టుడేంది? ఎవరికి తోచినట్లుగా వారు భక్తిభావంతో జపిస్తే పోయేదేముంది? అన్న సందేహం రావొచ్చు. కానీ.. హనుమాన్ చాలీసాను రాజకీయంగా మార్చేసి.. దాన్నో ఇష్యూగా చేసిన ఘనత కమలనాథులకే చెందుతుంది. ఈ కారణంతోనే కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటకలో పోలింగ్ ముగిసే వరకు హనుమాన్ చాలీసా పఠనం మీద ఆంక్షలు విధించింది. అయితే.. ఇదే హనుమాన్ చాలీసా గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు ఎమ్మెల్సీ కవిత.

గతానికి భిననంగా ఈ మధ్యన ఆమె తరచూ హనుమాన్ చాలీసాను పఠించటం తెలిసిందే. ఎందుకిలా? అంటే.. ఆమె కొత్త విషయాన్ని రివీల్ చేశారు. కరోనావేళ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే ఏం చేయాలని కొండగట్టు అర్చకులను తాను సలహా అడిగితే.. హనుమాన్ చాలీసా పారాయణానికి మించిన మందు మరొకటి లేదని చెప్పారని.. అప్పటి నుంచి తాను హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.

తాజాగా కొండగట్టు అంజన్నను దర్శించుకున్న కవిత..పారాయణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.మరికొద్ది నెలల్లో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వారు హనుమాన్ చాలీసాతో హడావుడి చేయాలంటే.. ఎమ్మెల్సీ కవిత కారణంగా పప్పులు ఉడకవంటున్నారు. కొన్నేళ్లుగా పారాయణం చేస్తున్న ఆమె.. దానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన నేపథ్యంలో.. బీజేపీ వారు కొత్త దారిని వెతుక్కోవాల్సి ఉంటుందేమో?