Begin typing your search above and press return to search.

ఇంతకీ జీవన్ రెడ్డి కవితపై సానుభూతి చూపారా.. సెటైర్ వేశారా!

By:  Tupaki Desk   |   27 July 2019 3:08 PM GMT
ఇంతకీ జీవన్ రెడ్డి కవితపై సానుభూతి చూపారా.. సెటైర్ వేశారా!
X
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడంలోనూ.. తెలివిగా వెటకారమాడడంలోనూ ఆరితేరిన కాంగ్రెస్ సీనియర్ నేత - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిజామాబాద్ మాజీ ఎంపీ - కేసీఆర్ కుమార్తె పై తాజాగా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జీవన్ రెడ్డి అసలు కవితకు సానుభూతి తెలిపారా.. లేదంటే చురకలు వేశారా అన్నది అర్థం కాక అటు కాంగ్రెస్ - ఇటు టీఆరెస్ రెండు పార్టీల నేతలూ బుర్ర గోక్కుంటున్నారు.

జీవన్ రెడ్డి శనివారం జగిత్యాలలో కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఓటమి పాలవడంపై మాట్లాడారు. అసలు టీఆర్ ఎస్ నేతలకు తెలివే లేదని అన్నారు. అసలు వాళ్లకేగాని తెలివి ఉంటే మొన్నటి ఎన్నికల్లో కవితను ఓడిస్తారా అని ప్రశ్నించారు. ఆ పార్టీలో గ్రూపుల కుమ్ములాటలే కవితను ఓడించాయని అన్నారు. ఈరోజు కవితకు తీరని అన్యాయం చేసింది కేవలం టీఆర్ ఎస్ పార్టీ నేతలే అని పెర్కొన్నారు. కవిత గెలిచుంటే బాగుండేదనే అభిప్రాయాన్ని జీవన్ రెడ్డి వ్యక్తం చేసారు. అంతేకాదు.. నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత గెలిచుంటే ఎంతో కొంత నిజామాబాద్‌ లో అభివృద్ధి జరిగేదని కూడా వ్యాఖ్యానించారు.

అయితే.. జీవన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కవితపై సానుభూతితో చేసినవి కావని.. ఎవరికైనా ఓటమి తప్పదని కవితకు గుర్తు చేయడానికే ఆయన ఇలా మాట్లాడారాని చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగిత్యాల నుండి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన జీవన్ రెడ్డిని ఓడించడానికి కవిత అక్కడే తిష్ట వేసిన సంగతి తెలిసిందే. ఆ కోపంతోనే జీవన్ రెడ్డి ఇలా వెటకారమాడారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆర్నెళ్లలోనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి టీఆర్ ఎస్ తరఫున పోటీచేసిన కవితపై.. ఆ పార్టీకే చెందిన రాజ్యసభ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇదంతా గుర్తు చేసి ఎత్తిపొడవడానికే జీవన్ రెడ్డి ఇలా సానుభూతి చూపించారని తెలుస్తోంది.