Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో ఎమ్మెల్సీ పోరు..రంగం సిద్ధం..కేసీఆర్ ప‌స తేలుతుందా?

By:  Tupaki Desk   |   6 Feb 2021 1:30 AM GMT
తెలంగాణ‌లో ఎమ్మెల్సీ పోరు..రంగం సిద్ధం..కేసీఆర్ ప‌స తేలుతుందా?
X
తెలంగాణలో మ‌రో ఎన్నిక‌కు ముహూర్తం సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే దుబ్బాక ఉప ఎన్నిక‌, గ్రేట‌ర్ హైద‌రా బాద్ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో దుబ్బాక సిట్టింగు స్థానాన్ని అధికార టీఆర్ ఎస్ కోల్పోయింది. ఇక‌, గ్రేట‌ర్‌లోనూ చావు త‌ప్పి.. అన్న‌ట్టుగా ఫ‌లితం క‌నిపించింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ స్థా నాల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డం అధికార టీఆర్ ఎస్‌లో గుబులు రేపుతోంది. త్వ‌ర‌లోనే ఇద్ద‌రు ఎమ్మెల్సీల ప‌ద‌వీ కాలం పూర్తి కానుంది. ఈ రెండు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలే కావ‌డం గ‌మ‌నార్హం. వీటికి త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ రానుంది.

రాష్ట్రంలో మొత్తం మూడు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. వీటిలో రెండు స్థానాల‌కు మార్చి 29తో కాల ‌ప‌రిమితి తీరనుంది. ఈ రెండు స్థానాల్లో నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి(టీఆర్ఎస్‌) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ‌కు ఎన్‌.రాంచందర్‌రావు(బీజేపీ) ఎమ్మెల్సీగా ఉన్నారు. వీరి పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో షెడ్యూల్ ప్ర‌క‌ట‌న‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది.

ఇదిలావుంటే.. ఈ రెండు స్థానాల్లోనూ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో వీటిని కైవ‌సం చేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ కూడా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో 10 లక్షల మందికి పైగా ఓటర్లున్నారు. దీంతో ఈ ఎన్నికల‌ను పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు మేధావులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లందరూ గ్రాడ్యుయేట్‌లు కావడంతో స‌ర్కారుపై వీరు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించేందుకు దీనిని ఎంచుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ వ‌ర్గంలోనూ ఈ ఎన్నిక‌లకు ప్రాధాన్యం పెరిగ‌డంతోపాటు.. ఏం జ‌రుగుతుంద‌నే టెన్ష‌న్ పెర‌గ‌డం గ‌మ‌నార్హం.