Begin typing your search above and press return to search.

చంద్రబాబు కథ కర్నూలులో తేలనుందా..?

By:  Tupaki Desk   |   10 March 2017 6:57 AM GMT
చంద్రబాబు కథ కర్నూలులో తేలనుందా..?
X
అయిదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో నిన్నటి నుంచి ఎగ్జిట్ పోల్స్ లెక్కల మీద దేమంతా ఒకటే చర్చోపచర్చలు. యూపీలో బీజేపీకి.. పంజాబ్ లో కాంగ్రెస్ కు విజయం వరిస్తుందని అంచనాలు వెలువడిన నేపథ్యంలో రాజకీయ చర్చలన్నీ దీనిపైనే సాగుతున్నాయి. అయితే.. ఇదే సమయంలో మన రాష్ట్రంలోనూ ఓ ఎన్నిక ఫలితంపై అంతా ఆసక్తిగా ఉన్నారు. ఇదేమీ రాష్ర్ట రాజకీయాలను - దేశగతిని మార్చేసే ఫలితం కానప్పటికీ ఏపీలో పాలక - విపక్షాల సామర్థ్యాలకు.. వారి పట్ల ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఏపీలో పట్టభద్రులు - ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. టీచర్ల స్థానాలు పక్కనపెడితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. యువతలో - పట్టభద్రుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ రేంజ్‌ లో ఉంది… వారి మనోగతం ఎలా ఉంది అన్నది ఈ ఎన్నికల ద్వారా తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల స్థానం ఇప్పుడు కీలకంగా మారింది. ఇక్కడ వైసీపీ - టీడీపీ అభ్యర్థులు నేరుగా బరిలో దిగడంతో ఫలితం ఆసక్తిగా ఉంది. టీడీపీ తరపున కేజే రెడ్డి - వైసీపీ తరపున గోపాల్ రెడ్డి బరిలో దిగి సిట్టింగ్ ఎమ్మెల్సీ గేయానంద్‌ తో తలపడ్డారు.

అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమ పశ్చిమ నియోజకవర్గంలో పట్టభద్రులు భారీగా ఓటింగ్‌ లో పాల్గొన్నారు. ఈసారి 68. 19 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది ఏకంగా 28. 56 శాతం అధికం. ఇలా భారీగా పట్టభద్రులు ఓటింగ్‌ కు పోటెత్తడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం కావచ్చని భావిస్తున్నారు. ఓటింగ్ సరళిని పరిశీలించిన వారు మాత్రం టీడీపీ దారుణంగానే దెబ్బతిన్నదని అభిప్రాయపడుతున్నారు. ప్రధాన పోటీ సిట్టింగ్ ఎమ్మెల్సీ గేయానంద్ - వైసీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్ రెడ్డి మధ్య హోరాహోరీగా సాగినట్టు భావిస్తున్నారు.ఈ ఎన్నికల్లో వంద శాతం గెలుపు తమదేనని వైసీపీ అభ్యర్థి గోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గేయానంద్ కూడా అంతే ధీమాతో ఉన్నారు. గేయానంద్‌ కు రెండో ప్రాధాన్యత ఓటు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రెండో ప్రాధాన్యత ఓటు కింద అటు టీడీపీ - ఇటు వైసీపీ సానుభూతిపరులు కూడా గేయానంద్‌ కు ఓటేసి ఉంటారని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు.. ఈ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి తలకిందులైపోయిందని గేయానంద్ వర్గం చెబుతోంది. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గోపాల్ రెడ్డి తనకు గట్టిపోటీ ఇచ్చారని గేయానంద్ స్వయంగా చెప్పడం విశేషం. టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పోలింగ్ సరళిలో స్పష్టంగా కనిపించిందనిచెప్పారు. మొత్తానికి కర్నూలు పట్టభద్రులు ఇచ్చే తీర్పు చంద్రబాబు పాలనపై ప్రజా తీర్పుగానే భావించాలంటున్నారు. మొత్తం మీద 2014 ఎన్నికల తర్వాత వైసీపీ, టీడీపీ నేరుగా పోటీ పడుతున్న ఎన్నికలు కావడంతో ఏం జరగనుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/