Begin typing your search above and press return to search.

బాబుకు ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్సీ ఎన్నిక

By:  Tupaki Desk   |   11 Feb 2023 4:00 PM GMT
బాబుకు ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్సీ ఎన్నిక
X
తెలుగుదేశం పార్టీని ఏదో విధంగా ముందుకు తీసుకుపోవాలని అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పార్టీలోని నాయకులు మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఉన్నారు. ఇంకా చాలా మంది నాయకులకు వచ్చే ఎన్నికల వేడి వాడి ఏంటో అర్ధం కావడంలేదు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తన క్యాండిడేట్ ని పోటీకి పెట్టింది.

ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ట్రాక్ రికార్డు చూస్తే ఇప్పటిదాకా తెలుగుదేశం గెలిచిన దాఖలాలు లేవు. అదే టైం లో ఒకటి రెండు సార్లు తప్ప ఆ పార్టీ పోటీ చేసిన హిస్టరీ లేదు. కానీ ఈసారి ప్రతిష్టగా తీసుకుని ఆ పార్టీ బరిలోకి దిగుతోంది. ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన బీజేపీ అభ్యర్ధి పీవీఎన్ మాధవ్ కి సాలిడ్ గా ఓటు బ్యాంక్ ఉంది.

అది పార్టీలకు అతీతంగా ఉంది. ఆయన తండ్రి పీవీ చలపతిరావు మూడు సార్లు పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా నెగ్గారు. దాంతో ఆయన వారసుడిగా మాధవ్ కి ఆ ఓటు బ్యాంక్ మళ్ళింది. 2017లో తెలుగుదేశంతో కలసి బీజేపీ పోటీ చేసి మంచి మెజారిటీని తెచ్చుకుంది. ఈసారి జనసేనతో కలసి పోటీకి దిగుతోంది.

వైసీపీ చాలా కాలం ముందే తన అభ్యర్ధిగా సీతం రాజు సుధాకర్ ని ప్రకటించింది. అధికార బలాన్ని, తమ పార్టీకి ఉన్న ప్రజా ప్రతినిధుల బలాన్ని నమ్ముకుని ఆ పార్టీ రంగంలో ఉంది. కామ్రేడ్స్ నుంచి ఒక అభ్యర్ధి ని ప్రకటించారు. శాసనమండలిని 2006లో పునరుద్ధరించాక జరిగిన రెండు ఎన్నికల్లో సీపీఎం అభ్యర్ధి నెగ్గారు దాంతో వారికంటూ ఓటు బ్యాంక్ ఉంది.

ఇంత పోటీ మధ్యన పోటీకి దిగిన తెలుగుదేశం పార్టీ గట్టిగా పోటీ ఇవ్వాలనుకుంటున్న నేపధ్యంలో సొంత పార్టీ నుంచే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఆ పార్టీ చోడవరం నియోజకవర్గం నుంచి వేపాడ చిరంజీవిరావుని ప్రకటించింది. అది కూడా ఎన్నికలు దగ్గర చేసి ఆయన పేరు ప్రకటించింది. ఇపుడే ఇది వివాదం అయింది. ఆయన కంటే ముందు బీసీ మహిళ, జీవీఎంసీ కార్పోరేటర్ గా ఉన్న గాడు చిన్ని కుమారి ని పార్టీ ప్రకటించింది.

ఆమె తన అభ్యర్ధిత్వాన్ని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో ఆమెను ఉన్నట్లుండి తప్పించేశారు. కాపుల ఓట్లు అన్న వ్యూహంతో చిరంజీవిరావుని దింపారు. దీని వెనక ఎవరు ఉన్నారు అన్నది పక్కన పెడితే ఇదే ఇపుడు పార్టీలో చిచ్చుగా మారింది. దీంతో బీసీలు రివర్స్ అవుతున్నారు. బీసీ మహిళను పక్కన ఎందుకు పెట్టారని సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వస్తోంది.

అయిదు నెలల పాటు ఆమె ప్రచారం చేసుకుంటూ వస్తే చెప్పా పెట్టకుండా వేరే వారిని ఎలా తెచ్చిపెడతారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని అసలు పార్టీ సభ్యత్వమే లేని చిరంజీవరావుని ఎలా ఎంపిక చేశారు అని మండిపడుతున్నారు. ఈ పరిణామాలతో బీసీలకు సర్దిచెప్పలేక పార్టీ పడుతున్న పాట్లకు తోడు అన్నట్లుగా ఇపుడు రెబెల్ గా మరో క్యాండిడేట్ పోటీకి వస్తున్నారు.

ఆయనే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఈర్లె శ్రీరామమూర్తి. తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి తాను ఉన్నాయని అలాంటి తనకు టికెట్ ఇవ్వకుండా పార్టీలో కొందరు సీనియర్లు అడ్డుకున్నారని ఆయన ఫైర్ అయ్యారు. పార్టీలో సభ్యత్వం లేని వారికి టికెట్ ఇవ్వడం భావ్యమేనా అని ఆయన ఫైర్ అయ్యారు. చంద్రబాబు సైతం సీనియర్ల మాటను విని తనను పక్కన పెట్టడం ఏంటి అని ఆయన గుస్సా అవుతున్నారు.

అందుకే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అని తనకు ఉన్న పరిచయాలతో గెలవడం ఖాయమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రాలో బీసీల పార్టీగా ముద్ర ఉన్న తెలుగుదేశం బీసీ మహిళకు టికెట్ ఇచ్చి ఇపుడు పక్కన పెట్టి కాపులకు టికెట్ ఇవ్వడం పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. దాంతో బీసీ నేతగా ఉత్తరాంధ్రాలో బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన నేత గా ఉన్న ఈర్ల బరిలోకి దిగుతున్నారు. ఆయన తనకు బీసీల మద్దతు ఉంది అని అంటున్నారు.

ఉత్తరాంధ్రాలో గత నాలుగేళ్లుగా ఎలాంటి విజయాలు లేక పార్టీ పరిస్థితి ఇబ్బందిలో పడిందని, దాన్ని చక్కదిద్దుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సత్తా చాటాలని చూస్తున్న తెలుగుదేశానికి ఇపుడు బీసీ నేత నుంచి పోటీ ఎదురుకావడం పట్ల చర్చ సాగుతోంది. మరి ఆయన్ని సముదాయించి పోటీ నుంచి తప్పిస్తారా లేక రెబెల్ తో తలనొప్పులు భరిస్తారా అన్నది చూడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.