Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షం ఎవ‌రో తెలిసిపోయింది

By:  Tupaki Desk   |   27 April 2018 4:20 AM GMT
తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షం ఎవ‌రో తెలిసిపోయింది
X
ఔను. తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షం ఎవ‌రో తెలిసిపోయిందంటున్నా రాజ‌కీయ విశ్లేష‌కులు. మ‌రోమారు కాంగ్రెస్ పార్టీయే ప్ర‌తిప‌క్షంలో ఉంటుంద‌ని ఒకింత ఆశ్చ‌ర్యంతోనే చెప్తున్నారు. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందుగానే కాంగ్రెస్ పార్టీని నారాజ్ చేసే వ్యాఖ్య‌లు చేయడం ఎందుకు...అయినా ఆ పార్టీ బ‌లోపేతం అయేందుకు స‌న్నాహాలు జ‌రుగుతుంటే మ‌రోవైపు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఎందుకు..అయినా దీనికి ఆధారం ఏంటీ...అంటే..కాంగ్రెస్ పార్టీలోని అంత‌ర్గ‌త లుక‌లుక‌లు. నేత‌ల విమ‌ర్శ‌లే. సీనియ‌ర్ నేత‌ నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర‌డంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మండిప‌డ్డారు. ఇటు పార్టీ నేత‌ల‌ను అటు పార్టీ పెద్ద‌ల తీరును ఆయ‌న త‌ప్పుప‌ట్టారు.

నాగం చేరికపై స్పందించిన ఎమ్మెల్యే దామోద‌ర్ రెడ్డి ఆహ్వానిస్తున్నా అంటూనే త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. ఏమీలేని వాడికి ఎందుకు అంత ప్రాధాన్యత అంటూ ప్రశ్నంచిన దామోదర్ రెడ్డి ఈ విష‌యంలో కాంగ్రెస్ పెద్ద‌లు సైతం స‌రిగా వ్య‌వ‌హరించ‌లేద‌న్నారు. `నాగం చేరికపై నాతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కుంతియా - ఉత్తమ్ చెప్పారు. కానీ, కనీసం మాట కూడా చెప్పలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుడు సమాచారం ఇస్తున్నారు` అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌ లో నాగం చేరితో కనీసం ఇంచార్జ్‌ ని - డీసీసీ అధ్యక్షుడిని కూడా పిలవరా? అని ప్రశ్నించారు.

20 ఏళ్లుగా నాగంతో కొట్లాడి ఇప్పుడు ఆయనతో కలిసి ఎలా పనిచేస్తానని దామోదర్ రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు. డీకే అరుణ ప్రాబల్యం తగ్గించేపనిలో జైపాల్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ వాళ్లే నాగం గెలవాలని కుట్ర చేశారని ఆరోపించిన ఆయన జైపాల్ రెడ్డి కూడా నాగంకే మద్దతు ఇచ్చే వారన్నారు. జైపాల్ రెడ్డికి నియోజకవర్గం ఉందా? అంటూ ప్రశ్నించిన ఆయన కాంగ్రెస్ పార్టీ జైపాల్ రెడ్డికి సేవ చేస్తుంది… కానీ, కాంగ్రెస్ కి జైపాల్ రెడ్డి ఎప్పుడూ సేవ చేయలేదన్నారు. కనీసం పార్టీలో మూడేళ్లు పనిచేసిన వారికే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాగంకు టికెట్ ఇస్తే మద్దతు మాత్రం ఇవ్వబోమని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు దామోదర్ రెడ్డి ప్రకటించారు. ఇలాంటి లుక‌లుక‌లు, విమ‌ర్శ‌లు, ప‌గ‌ల‌తో ఉన్న పార్టీ అధికారంలోకి రావ‌డం ఎలా అంటూ రాజ‌కీయ నేత‌లు వ్యాఖ్యానిస్తుండ‌టం గ‌మ‌నార్హం.