Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు తీరికైనా వారు మాత్రం బిజీ

By:  Tupaki Desk   |   18 Jun 2016 7:07 AM GMT
చంద్రబాబుకు తీరికైనా వారు మాత్రం బిజీ
X
దేనికైనా డుమ్మా కొట్టడంతో నవ్యాంధ్ర ప్రజాప్రతినిధులను మించినవారు లేనట్లున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200 మంది ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టేశారు. ఐక్యరాజ్యసమితి కీలక విభాగం యూనిసెఫ్ - ఏపీ అసెంబ్లీ - శాసనమండలి - సీఐఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పిలిచినవారిలో పదో వంతు ప్రజాప్రతినిధులు కూడా రాలేదు. సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు హాజరైన ఈ కీలక సమావేశానికి ఏపీలోని ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు మొత్తం 225 మందిని ఆహ్వానించారు. విజయవాడలోని గేట్ వే హోటల్ లో పిల్లల పౌష్టికాహారంపై ఈ కీలక సదస్సు జరిగింది. శాసనసభ - మండలి సభ్యులంతా (ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు) హాజరుకావాలని ఆహ్వానాలు అందరికీ అందాయి. కానీ... వారి నుంచి స్పందన మాత్రం లేదు. ఏపీ శాసనసభ - మండలిలో మొత్తం 225 మంది సభ్యులుండగా - వారిలో కేవలం 25 మంది మాత్రమే ఈ సదస్సుకు హాజరయ్యారు. దీంతో సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొన్న ఈ సదస్సు వెలవెలబోయింది.

శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ - ఇద్దరు మంత్రులు - కొద్దిమంది ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు మాత్రమే దీనికి హాజరయ్యారు. అంతర్జాతీయ సంస్థ యూనిసెఫ్... ఏపీ శాసనసభ - శాసనమండలి సంయుక్త నిర్వహించిన ఇంతటి కీలక సమావేశంపైనే ప్రజాప్రతినిధులకు శ్రద్ధలేకపోవడంపై విమర్శలొస్తున్నాయి. కాగా ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కు యువతే ఆధారమని.. దేశంలో - రాష్ర్టంలో జనాభా తగ్గిపోయే ప్రమాదం కనిపిస్తోందని చెప్పిన చంద్రబాబు పిల్లలే మన ఆస్తి అంటూ యువ దంపతులు ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు.

చంద్రబాబు గతంలోనూ ఇలా పిల్లల విషయంలో పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఒకరిద్దరితో ఆపేయొద్దని ఎక్కువ మందిని కనాలని ఆయన పదేపదే సూచిస్తున్నారు. అయితే... దేశంలో ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే కొన్ని ఇబ్బందులున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడం వంటి విషయాల్లో అది ఆటంకమవుతుంది. మరి... వాటికి పరిష్కారం మాత్రం బాబు సూచించడం లేదు. పిల్లలను మాత్రం ఇబ్బడిముబ్బడిగా కనమని సూచిస్తున్నారు.