Begin typing your search above and press return to search.

మంత్రి పై ఫైర్ అయిన ఎమ్మెల్యే .. అసలు కారణం ఇదే ?

By:  Tupaki Desk   |   7 Nov 2019 6:09 AM GMT
మంత్రి పై ఫైర్ అయిన ఎమ్మెల్యే .. అసలు కారణం ఇదే ?
X
తెలంగాణ లో అధికార టిఆర్ఎస్ పార్టీ వరుస విజయాలతో జోరుమీదుంది. ఈ మద్యే జరిగిన హుజూర్ నగర్ ఎన్నికలలో కూడా రికార్డ్ స్థాయి మెజారిటీ తో గెలవడం తో ఆనందంలో మునిగిపోయారు పార్టీ నేతలు. కానీ , మనం ఒకటి తలిస్తే ..దేవుడు మరొకటి తలుస్తాడు అన్నట్టు కారు జోరుకి త్వరలోనే బ్రేకులు పడేట్టు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారం చేపట్టిన తెరాస .. రాష్ట్రంలోని పలువురు కీలక నేతలని కారు ఎక్కించుకుంది. ఇక ఈ గత ఏడాది జరిగిన ఎన్నికల తరువాత రాష్ట్రంలో తెరాస కి ఎదురుగా నిలిచే సరైన నాయకుడే లేకుండా పోయారు. దీనికి కారణం ఉన్న నేతలందరూ తెరాస లోనే ఉన్నారు. ఇక మిగిలిన కొందరు నేతలు కాంగ్రెస్ లో ఉన్నా కూడా వారికీ పదవుల కోసం ప్రాకులాడటానికే సమయం సరిపోవడం లేదు.

ఇకపొతే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టు .. తెరాస లో నేతలు ఎక్కువై కొద్దీ .. తెరాస లో ఉండే అంతర్గత కలహాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు బాహాటంగానే తమ అసంతృప్తి ని వెల్లడించారు. ఇక తాజాగా గురు , శిష్యుల మధ్య గొడవలు బయట పడ్డాయి. ఎమ్మెల్యే కోనప్ప, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలది, ఏళ్లకాలం నుంచి విడదీయలేని బంధం. ఒకప్పుడు ఎంతో ఆప్యాయంగా ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు వదిలితే ఒకరిపై ఒకరు పడి కొట్టుకునే స్థాయికి వచ్చేసారు. వీరి గొడవ చూసి ప్రతిపక్షాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.

తాజాగా ఉట్నూరు ఐటిడిఎ పాలకవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశం లో సభ సాక్షిగా ఇద్దరు ఒకరి పై ఒకరు విమర్శలకి దిగారు. ఈ సమావేశానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసారు. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరైయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్ నిర్మల్‌లో తేనే పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారట. నిర్మల్‌లో మంత్రి నియోజకవర్గంలో తేనే ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారట ఎమ్మెల్యే కోనప్ప. నిర్మల్‌లోనే ఎందుకు పరిశ్రమను ఏర్పాటు చేస్తారని సమావేశంలోనే మంత్రిని ప్రశ్నించారట. వెనుక బడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా, మంత్రి ఇలాకాలో ఎలా ఏర్పాటు చేస్తారని మంత్రి తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారట. ఒకదశలో మంత్రి ఎమ్మెల్యే మధ్య పరిశ్రమ ఏర్పాటుపై వాగ్వాదం తారాస్థాయికి చేరిందట. కోనప్ప, మంత్రి మధ్య నువ్వెంత అంటే నువ్వెంతనే స్థాయికి చేరడంపై టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఆశ్చర్యపోయారట. మూడేళ్ల కింద కూడా ఇలాంటి ప్రతిపాదనపై ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. గతంలో కోనప్ప తమ్ముడి విషయంలో మంత్రితో విబేధాలు పెంచుకున్న ఈయన ..ఆ తరువాత కీలక నేతలు ఇద్దరి మధ్య సంధి కుదిర్చారు. కానీ , మరోసారి ఇద్దరూ నువ్వా నేనా అని పోట్లాడటంతో ..కార్యకర్తల్లో కూడా ఆందోళన మొదలైంది. ఇప్పుడే ఇలా ఉంటె ఇక ఎన్నికల సమయానికి ఎలా ఉంటుందో అని చర్చలు జరుపుతున్నారు.