Begin typing your search above and press return to search.

దేవిశ్రీప్రసాద్ కు చెప్పులతో స్వాగతం పలుకుతాం: బీజేపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   18 Dec 2021 10:30 AM GMT
దేవిశ్రీప్రసాద్ కు చెప్పులతో స్వాగతం పలుకుతాం: బీజేపీ ఎమ్మెల్యే
X
'పుష్ప’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఐటమ్ సాంగ్స్‌ ను భక్తి గీతాలతో పోలుస్తూ.. 'రింగ రింగా' 'ఊ అంటావా' వంటి స్పెషల్ సాంగ్స్ లో భక్తి సాహిత్యాన్ని చేర్చి ఆలపించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. డీఎస్పీ కామెంట్స్ పై హిందూ సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. తాజాగా దేవిశ్రీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు.

దేవుడి శ్లోకాలకు ఐటెమ్ సాంగ్స్ కు తేడా లేదనే విధంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతున్నారని.. అసలు అలాంటి ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని రాజా సింగ్ అన్నారు. దేవీశ్రీ వ్యాఖ్యలు హిందూవుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. వెంటనే యావత్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

క్షమాపణలు చెప్పకపోతే దేవిశ్రీప్రసాద్ పని ఏమవుతుందో.. హిందూ సమాజం ఏవిధంగా స్వాగతం పలుకుంటుందో.. తెలంగాణలో ఎలా అడుగు పెడతారో చూస్తానంటూ రాజా సింగ్ వార్నింగ్ ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ చాలా తప్పుగా భక్తి గీతాలతో ఐటమ్ సాంగ్స్‌ ను పోల్చి మాట్లాడారని.. తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని అన్నారు. దేవిశ్రీ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పకుంటే.. తెలంగాణలోని హిందూ ప్రజలు చెప్పులతో స్వాగతం పలుకుతారని బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరించారు.

కాగా, 'పుష్ప' సినిమా ప్రెస్ మీట్ లో 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' పాట గురించి దేవిశ్రీ ప్రసాద్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. తన దృష్టిలో ఐటమ్ సాంగ్స్ అన్నీ భక్తి గీతాలే అని అభిప్రాయ పడ్డారు. మనల్ని ఒక ట్రిప్ లోకి తీసుకెళ్లేది డివోషనల్ మెడిటేషన్ అయితే.. అది ఐటమ్ సాంగ్ అయితేనేం అని అన్నారు. మ్యూజిక్ కంపోజర్ గా తనకు ఏ పాటైనా ఒకటే అని.. అది ప్రేక్షకులకు మాత్రమే ఐటమ్ సాంగ్ అని చెప్పారు. 'రంగ రంగ' ఎలాగో.. 'ఫీల్ మై లవ్' కూడా అలానే.. నాకు అది మ్యూజిక్ మాత్రమే అని తెలిపారు.

ఈ సందర్భంగా ‘రింగ రింగా’ పాటను భక్తి పాటగా మార్చి దేవిశ్రీ ప్రసాద్ పాడారు. 'కెవ్వు కేక' సాంగ్ కూడా అలాంటిదే అని అన్నారు. అలానే అన్నమాచార్య కీర్తనలకు ప్రసిద్ధి చెందిన గాయని శోభారాణి.. 'ఊ అంటావా' ట్యూన్ లో ‘ఊ అంటావా మాధవా' అనే భక్తి గీతాన్ని పాడిన విషయాన్ని దేవీ ప్రస్తావించారు. అయితే దేవిశ్రీ కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సంగీత దర్శకుడికి ఏ పాట అయినా ఒకటే అని కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. గతంలో దేవి కంపోజ్ చేసిన భక్తి గీతాలను గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం చాలా దేవాలయాల్లో సినిమా పాటల ట్యూన్స్ లో డివోషనల్ సాంగ్స్ ప్లే అవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

మరి కొందరు మాత్రం హిందువుల మనోభావాలను కించపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాజా సింగ్ కూడా డీఎస్పీ వ్యాఖ్యలను ఖండిస్తూ.. బహిరంగంగా తిరగలేవంటూ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరికపై దేవిశ్రీ ప్రసాద్ ఇంకా స్పందించలేదు. నిజానికి డీఎస్పీ వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. ఇప్పుడు 'పుష్ప' ఈవెంట్ లో కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా తనకు ఏ పాట అయినా ఒకటే అనే విధంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ వివాదం పెద్దది కాకముందే ఇదే విషయం పై దేవీ వివరణ ఇస్తారేమో చూడాలి.