Begin typing your search above and press return to search.

పుట్టింటోళ్లూ తరిమేశారు, క‌ట్టుకున్నోడూ వ‌దిలేశాడు!

By:  Tupaki Desk   |   27 Jan 2020 4:43 AM GMT
పుట్టింటోళ్లూ తరిమేశారు, క‌ట్టుకున్నోడూ వ‌దిలేశాడు!
X
పుట్టింటోళ్లూ తరిమేశారు, క‌ట్టుకున్నోడూ వ‌దిలేశాడు..దశాబ్దాల కింద‌టి ఈ ఐట‌మ్ సాంగ్ ను గుర్తు చేస్తూ ఉంది వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ ప‌రిస్థితి! అని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈయ‌న తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు, అలాగ‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర కాలేక‌పోతున్నారు.. ఒక‌వైపు ఎమ్మెల్యేగా కొన‌సాగుతూ ఉన్నారు, అసెంబ్లీకి హాజ‌రై ఒక మూల కూర్చుంటూ ఉన్నారు. ఎప్పుడో ఒక‌సారి మాట్లాడే అవ‌కాశం వ‌స్తే అప్పుడు సీఎం జ‌గ‌న్ ను ప్ర‌శంసిస్తూ ఉన్నారు. అయితే అలాగ‌ని ఆయ‌న‌ను వైసీపీ చేర‌దీయ‌డం లేదు.

ఇప్ప‌టి వ‌ర‌కూ వంశీ మెడ‌లో వైసీపీ కండువా ప‌డ‌ని సంగ‌తి తెలిసిందే. రాజీనామా చేస్తేనే వైసీపీ కండువా అనే ష‌ర‌తుతో వంశీ చేరిక అలా ఆగిపోయింది. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఆయ‌న‌ను బ‌హిష్క‌రించిన‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌న‌తో ఆయ‌న‌పై అన‌ర్హత వేటు త‌ప్పింది. ఎమ్మెల్యే ప‌ద‌వి అయితే అలా మిగిలింది కానీ.. వల్ల‌భ‌నేని వంశీది ఇప్పుడు అలా చిత్ర‌మైన ప‌రిస్థితే.

అందులోనూ ఇత‌డు ఒక యాక్టివ్ పొలిటీషియ‌న్. తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున అతిగా స్పందిస్తూ వ‌చ్చారు అప్ప‌ట్లో. జ‌గ‌న్ మీద వీర‌లెవ‌ల్లో విరుచుకుప‌డ్డారు కొన్నిసార్లు. ఇక స్థానికంగా రాజ‌కీయాల‌తో పాటు.. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ నేత‌ల‌తో స‌త్సంబంధాలు మెయింటెయిన్ చేసేంత వ‌ర‌కూ వెళ్లి.. వార్త‌ల్లో నిలిచాడు వంశీ మోహ‌న్. ఇలాంటి నేప‌థ్యంలో.. ఇప్పుడు ఏ పార్టీకీ చెందని వాడిగా వ్య‌వ‌హ‌రించ‌డం ఆయ‌న‌కు తేలిక కాక‌పోవ‌చ్చు!

ఏదో ఒక వైపు ఉండి హ‌డావుడి చేయ‌డం అల‌వాటు అయిన వారికి ఇది మ‌రింత క‌ష్ట‌మైన ప‌రిస్థితి. వ‌ల్ల‌భ‌నేనిలా అతి చేసిన వారికి ఇది మరీ క‌ష్ట‌మైన అంశం. ఇప్పుడు ఆయ‌న ప‌రిస్థితి అటూ ఇటూ కాకుండా ఉంద‌ని, తెలుగుదేశం పార్టీకి దూర‌మై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర కాలేక ఆయ‌న పూర్తిగా డ‌ల్ అయిన విధానం కూడా పై ఫొటోను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చ‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు.