Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కుపై ఉద్యమం చేస్తాననే బాబు.. మోడీకి లేఖ రాయటానికి వణుకు

By:  Tupaki Desk   |   17 Feb 2021 4:30 AM GMT
విశాఖ ఉక్కుపై ఉద్యమం చేస్తాననే బాబు.. మోడీకి లేఖ రాయటానికి వణుకు
X
ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. పంచాయితీ ఎన్నికలు..విశాఖ ఉక్కు అంశాలపై బాబు చేసే వ్యాఖ్యల్ని తీవ్రస్థాయిలో తిప్పి కొట్టిన ఆయన.. బాబుపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పంచాయితీ ఎన్నికల్లో తమ పార్టీ సాధించి విజయాల గురించి చెప్పిన శ్రీకాంత్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీని నకిలీగా మార్చేశారని మండిపడ్డారు. ప్రజాదరణ కోల్పోయి ఫేక్ వార్తల ప్రచారానికి దిగిందన్నారు.

పంచాయితీ ఎన్నికల్లో టీడీపీకి పట్టుమని 15 శాతం పంచాయితీలు రాలేదన్నారు. బాబు నమ్మదగిన వ్యక్తి కాదని ప్రజలు భావించారని.. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఓటేసిన వారు ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులకు ఓటేశారన్నారు. బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలో ఒక చోట టీడీపీ మద్దతుదారులు నామినేషన్ వేయించారన్న వార్త ఒక పత్రికలో వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో అలాంటివే పెద్ద వార్తలు అవుతాయేమో? అంటూ ఎద్దేవా చేశారు.

విశాఖ ఉక్కుపై బాబు చేస్తున్న విమర్శలను తీవ్రంగా తిప్పి కొట్టారు శ్రీకాంత్ రెడ్డి. హెరిటేజ్ సంస్థను అమ్మితే బాబు ఊరుకుంటారా? అలాంటిది కేంద్ర సంస్థ అయిన విశాఖ స్టీల్ ను రాష్ట్రం ఎలా అమ్మగలదు? ఆ మాత్రం ఇంగితం లేదా? 54 ప్రభుత్వ రంగ సంస్థల్ని తన వాళ్లకు పప్పుబెల్లాల మాదిరి అమ్మేసిన ఆయన ఈ రోజు మాట్లాడటమా? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కోసం ఉద్యమం చేస్తామని చెబుతున్న చంద్రబాబు.. ముందు ప్రధాని మోడీకి లేఖ రాయరెందుకు? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో పని చేస్తుందన్నారు. రానున్న రోజుల్లోఈ అంశంపై రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పాతిక కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు.