Begin typing your search above and press return to search.

2024 ఎన్నికల్లో నలుగురు వాలంటీర్లకు ఎమ్మెల్యే సీట్లు?

By:  Tupaki Desk   |   1 Aug 2022 9:35 AM GMT
2024 ఎన్నికల్లో నలుగురు వాలంటీర్లకు ఎమ్మెల్యే సీట్లు?
X
దేశంలో ఎక్కడా లేని విధంగా వలంటీర్ల వ్యవస్థను ఏపీలో రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలోనూ వలంటీర్ల సేవలు అద్భుతమని, వారు ఉండడం వల్లే కరోనా కట్టడి సాధ్యమైందని ప్రశంసలు కూడా దక్కాయి. అంతేకాదు, ఏపీలో వలంటీర్ల వ్యవస్థను చూసి కేరళ వంటి రాష్ట్రాలు అక్కడ కూడా వలంటీర్ల మాదిరి వ్యవస్థను రూపొందించే పనిలో పడ్డాయి.

తమకు కూడా జీతాలు ఇవ్వాలని, ప్రభుత్వం తమకు ఇచ్చే 5 వేల రూపాయల జీతం సరిపోవడం లేదని వలంటీర్లు గతంలో ఉద్యమబాటపట్టారు. దీంతో, రంగంలోకి దిగిన జగన్...వలంటీర్ లు చేసేది సేవ అని, వారికిచ్చేది గౌరవ వేతనం మాత్రమే అని, జీతం కాదని హితబోధ చేశారు. వలంటీర్లు వారంలో మూడు రోజులు పనిచేస్తే చాలని చెప్పిన జగన్ ఉత్తమ సేవలందించిన వలంటీర్లను సన్మానించారు కూడా.

అయినప్పటికీ వలంటీర్లలో కొద్దోగొప్పో అసంతృప్తి ఉందని టాక్ వస్తోంది. పైగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలంటే వాలంటీర్ల వ్యవస్థ ఎంతో కీలకం. దీంతో, రాబోయే ఎన్నికల్లో వలంటీర్ల మద్దతు వైసీపీకి పరోక్షంగా చాలా అవసరం.

అందుకే, వలంటీర్లను బుజ్జగించేందుకు జగన్ సరికొత్త వ్యూహాన్ని రచించినట్లు ప్రచారం జరుగుతుంది . 2024 ఎన్నికల్లో నలుగురు వలంటీర్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారని అని అంటున్నారు.

ఇలా, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం ద్వారా వలంటీర్లను గౌరవించినట్లు కూడా అవుతుందని జగన్ భావిస్తున్నారట. రాబోయే ఎన్నికల్లో ఎవరెవరికి సీట్లు కన్ ఫర్మ్ అవుతాయో తెలియని పరిస్థితి. అందుకే, వాలంటీర్లను సంతోష పరిచేందుకు వారికి నాలుగు సీట్లు ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారట. అలా చేయడం ద్వారా వారిలో ఉన్న అసంతృప్తిని చల్లార్చి వారితో పనిచేయించుకోవడం సులువు అవుతందని భావిస్తున్నారట.

కొంతమంది ఎమ్మెల్యేలకు ఓట్లు పడతాయో లేదో గ్యారెంటీ లేదని, కానీ, జగన్ ఇమేజ్ వల్ల వారికి ఓట్లు పడే అవకాశాలున్నాయని టాక్. అందుకే, ఆ ఎమ్మెల్యేలకు బదులుగా వలంటీర్లకు సీట్లు ఇవ్వడం ద్వారా జగన్ ను చూసి ఓటు వేసే వారు ఎమ్మెల్యేలుగా నిలబడ్డ వలంటీర్లకు కూడా ఓట్లు వేస్తారని పార్టీ భావిస్తోందట. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వలంటీర్లకు టికెట్లు ఇవ్వాలని జగన్ ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.