Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యే సోదరి గుడుంబా రాణి

By:  Tupaki Desk   |   27 Nov 2015 7:23 AM GMT
ఆ ఎమ్మెల్యే సోదరి గుడుంబా రాణి
X
హైదరాబాద్ లో ధూల్ పేట అంటే ఎవరికైనా గుర్తొచ్చేది ఒక్కటే... అది గుడుంబా. అదో ప్రత్యేక రాజ్యమని... అక్కడ అడుగుపెట్టడం కష్టమని చెప్తుంటారు. గుడుంబా తయారీ, వ్యాపారం మూడు పువ్వులు ముప్ఫయ్యారు కాయలుగా వర్ధిల్లుతున్న ధూల్ పేటలో ఎందుకో తెలియదు కానీ ఎక్సయిజు అధికారులు ఒక్కసారిగా స్పీడు పెంచారు. వారం రోజులుగా వరుసదాడులతో గుడుంబా పెద్దలను పట్టుకుంటున్నారు. అందులో భాగంగానే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధ్ సోదరిని కూడా ఆబ్కారీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు.

గత వారం రోజులుగా జరిపిన దాడుల్లో 56కేసులు నమోదు చేసి, 37మందిని అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించినట్లు ధూల్‌ పేట ఎక్సైజ్ ఇన్‌ స్పెక్టర్ బి.కనకదుర్గ చెబుతున్నారు... తాము అరెస్టు చేసినవారిలో ఎమ్మెల్యే సోదరి కూడా ఉందని స్పష్టం చేశారు.

కాగా హైదరాబాద్ నగరంలో బీజేపీలో కీలకంగా వ్యవహరించే ఎమ్మెల్యేగా లోధ్ ను కంట్రోలు చేయడానికి... ఆయనకు సంబంధించిన వ్యాపారాలు - వ్యక్తులపై దాడులు పెంచడానికి టీఆరెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ధూల్ పేట దాడులు, ఎమ్మెల్యే సోదరి అరెస్టు జరిగాయని సమాచారం. అయితే... లోధ్ ను ఎందుకు టార్గెట్ చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయని అర్తమయ్యే ఉంటుంది.