Begin typing your search above and press return to search.

సిద్దపేటలో ఎయిర్ పోర్ట్ .. జీఎంఆర్ కండిషన్ మర్చిపోయావా కేసీఆర్ !

By:  Tupaki Desk   |   11 Dec 2020 9:33 AM GMT
సిద్దపేటలో ఎయిర్ పోర్ట్ .. జీఎంఆర్ కండిషన్ మర్చిపోయావా కేసీఆర్ !
X
సీఎం కేసీఆర్ సిద్ధిపేట జిల్లా పర్యటన పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా పర్యటనను సిద్దిపేట నియోజకవర్గ కార్యక్రమంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని,ముఖ్యమంత్రి గానీ,జిల్లా అధికార యంత్రాంగం గానీ కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికే గజ్వేల్‌లో 100 పడకల ఆస్పత్రి ఉంది.సిద్దిపేటలో 100 పడకల ఆస్పత్రి ఉంది. లేనిది దుబ్బాకకు మాత్రమే. ఇప్పటికీ అక్కడ 100 పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయట్లేదు అని విమర్శించారు.

దాదాపుగా రూ.700కోట్లుతో కేంద్రం మెడికల్ కాలేజీ మంజూరు చేస్తే, దాన్ని కూడా సిద్దిపేటకు తీసుకెళ్లారు. మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి నన్ను పిలవడానికి అహం అడ్డు వచ్చిందా, అది మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవమా లేక కల్వకుంట్ల వారి కార్యక్రమా... ప్రభుత్వం ఏది ఇచ్చినా గజ్వేల్,సిద్దిపేట,సిరిసిల్లకే ఇస్తుందని దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా చెప్పాను. సిద్దిపేట పర్యటనలో కేసీఆర్ హామీలతో ఈ విషయం మరోసారి రుజువైంది అని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేటకు రెండో రింగ్ రోడ్డు కోసం నిధులు కేటాయిస్తామని కేసీఆర్ సిద్దిపేట సభలో చెప్పారని గుర్తుచేశారు. అసలు ఇప్పటివరకు రింగు రోడ్డే లేని దుబ్బాకకు రింగు రోడ్డు ఇవ్వకుండా సిద్దిపేటకు రెండో రింగ్ రోడ్డు ఇవ్వడమేంటని ప్రశ్నించారు.

సిద్దిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి... దుబ్బాకలో కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం నిధులు ఎందుకు కేటాయించరని ప్రశ్నించారు. సిద్దిపేటను అభివృద్ది చేస్తే తమకేమీ అభ్యంతరం లేదని... కానీ సిద్దిపేటకు ఏమిస్తే తమకు కూడా న్యాయం చేయాలని కోరారు. కొడుకు కోసం కొత్త సెక్రటేరియట్,అల్లుడి కోసం సిద్దిపేట మెడికల్ కాలేజీ,మనువడి కోసం గజ్వేల్‌ను అభివృద్ది చేశారని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ యూపీఏ హయాంలో 2004లో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు జీఎంఆర్ గ్రూపు కేంద్ర విమానాయాన శాఖతో ఒక ఒప్పందం చేసుకుందని రఘునందన్ రావు గుర్తుచేశారు. దాని ప్రకారం... 2033 సంవత్సరం వరకు హైదరాబాద్ నుంచి 150కి.మీ పరిధిలో ఎక్కడా మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించకూడదన్న నిబంధన ఉందన్నారు. ఈ విషయం తెలిసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో వరంగల్ ప్రజలకు మూడేళ్లలో విమానాశ్రయం వస్తుందని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు సిద్దిపేట ప్రజలకు హామీ ఇచ్చారంటూ విమర్శలు కురిపించారు.