Begin typing your search above and press return to search.

హీరో అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..!

By:  Tupaki Desk   |   13 Jan 2022 11:30 PM GMT
హీరో అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..!
X
అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక్క‌సారిగా హీరోగా మారిపోయారు. ప్ర‌జ‌ల చేత శ‌భాష్ అనిపించుకున్నారు. హీరో అంటే సినిమా న‌టుడిగా మార‌డం కాదు.. ఏళ్లుగా వివాదంలో ఉన్న ఒక‌ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి ప్ర‌జ‌ల్లో నిజ‌మైన హీరోగా గుర్తింపు పొందారు. ఆయ‌నెవ‌రో కాదు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. ఇటీవ‌ల వ‌రుస అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో.. ప‌లు వినూత్న ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల మ‌న‌సు చూర‌గొంటున్నారు రోహిత్ రెడ్డి.

వికారాబాద్ జిల్లాలోనే పేరుకే అతి పెద్ద ప‌ట్ట‌ణంగా ఉంది తాండూరు. కానీ ప్ర‌ధాన ర‌హ‌దారులు మాత్రం కుచించుకుపోయి ఉన్నాయి. ఐదేళ్లుగా వివాదంలో ఉన్న అలాంటి ఒక రోడ్డు విస్త‌ర‌ణ‌కు మార్గం సుగ‌మం చేశారు ఎమ్మెల్యే. ప‌ట్ట‌ణంలోని ఇందిరా చౌక్ నుంచి రైల్వే స్టేష‌న్ వ‌ర‌కు ఉన్న మార్గాన్ని విస్త‌రించి అభివృద్ధి చేసేందుకు గ‌త ఐదేళ్లుగా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అర్బ‌న్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ నుంచి మంజూరైన రుణంతో ఈ రోడ్డును విస్త‌రించాల‌ని నిర్ణ‌యించారు. ఆస్తులు కోల్పోతున్న వారికి మిన‌ర‌ల్ ఫండ్ నుంచి ప‌రిహారం అందించారు.

మాజీ మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి గ‌తంలో ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడే ఈ రోడ్డు విస్త‌ర‌ణ‌కు స‌హక‌రించారు. ఎన్నిక‌ల‌ స‌మ‌యంలో తీవ్రంగా ప్ర‌య‌త్నించినా సాధ్య‌ప‌డ‌లేదు. విస్త‌ర‌ణ‌లో ఆస్తులు కోల్పోతున్న య‌జ‌మానులు కోర్టును ఆశ్ర‌యించ‌డంతో ప‌రిస్థితి మొద‌టికి వ‌చ్చింది. ప‌నులు ఎక్క‌డిక‌క్క‌డే ఆగిపోయాయి. పైలెట్ ఎమ్మెల్యే అయ్యాక ఈ స‌మ‌స్య‌పై ప్ర‌త్యేక చొర‌వ చూపారు. బాధితుల‌తో ప‌లు ద‌ఫాలుగా భేటీ అయ్యారు. వారి డిమాండ్ల‌ను నెర‌వేర్చుతాన‌ని.. ప్ర‌భుత్వం నుంచి ప‌రిహారం ఇప్పిస్తాన‌ని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు మెత్త‌బ‌డ్డారు.

బాధితుల‌లో ఒక‌రైన ఎంఐఎం పార్టీ అధ్య‌క్షుడు తొలుత త‌న ఆస్తులు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చారు. ఎమ్మెల్యే స్వ‌యంగా ద‌గ్గ‌రుండి భ‌వ‌నాల కూల్చివేత‌ల‌ను ప్రారంభించారు. బాధితుల నుంచి ఎక్క‌డా అసంతృప్తి రాకుండా.. గొడ‌వలు.. ఆందోళ‌న‌లు జ‌ర‌గ‌కుండా కూల్చివేత‌ల‌ను శాంతియుతంగా జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. విస్త‌ర‌ణ‌కు ముందుకు వ‌చ్చిన వారిని ఎమ్మెల్యే స‌న్మానించారు.

ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న రోడ్డు విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మం షురూ అవ‌డంతో అంద‌రూ ఎమ్మెల్యేని మెచ్చుకుంటున్నారు. రోహిత్ రెడ్డి నిజ‌మైన హీరో అని అంద‌రూ అభినందిస్తున్నారు. ఇటీవ‌ల స‌మ‌స్య‌ల కోసం ఒక మొబైల్ యాప్ కూడా రూపొందించారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో రోహిత్ రెడ్డి గ్రాఫ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది.