Begin typing your search above and press return to search.

నోరుంది కదా అని మాట్లాడతావా? ఇదే నా సవాల్ అంటూ మేకపాటి సీరియస్

By:  Tupaki Desk   |   28 March 2023 8:00 PM GMT
నోరుంది కదా అని మాట్లాడతావా? ఇదే నా సవాల్ అంటూ మేకపాటి సీరియస్
X
మొన్నటివరకు ప్రత్యర్థులపై విరుచుకుపడిన వైసీపీ నేతలు.. ఇటీవల మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొందరు నేతల మధ్య నడుస్తున్న రచ్చ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ముఖ్యమంత్రి కమ్ పార్టీ అధినేత జగన్ మీద అభిమానం ఉన్నా.. ఆయన నమ్మకున్న సజ్జల లాంటి వారి తీరుతో విసిగిపోయిన కొందరు నేతలు పార్టీకి రెబల్ గా మారటం తెలిసిందే. ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అధినేత జగన్ కు దిమ్మ తిరిగే షాకిచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై వైసీపీ నేతలు విరుచుకుపడటం తెలిసిందే.

దీనిపై మండిపడుతున్న వారు.. తమను ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడతారా? అంటూ సీరియస్ అవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడిన నాటి నుంచి మౌనంగా ఉన్న ఆయన.. తాజాగా సీరియస్ అయ్యారు. ‘‘నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదు. వచ్చే ఎన్నికల్లో నాతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు గెలవటం ఖాయం’’ అని తేల్చేశారు.

ఈ విషయాన్ని తానేదో ఆషామాషీగా అనటం లేదన్న విషయాన్ని స్పష్టం చేసిన మేకపాటి.. తాను చెప్పినట్లుగా తమ ముగ్గురం కానీ గెలవకుంటే రాజకీయాల్ని తాను పూర్తిగా వదిలేస్తానని సీరియస్ సవాలు విసిరారు. ఇక్కడితో ఆగని ఆయన అనిల్ కు మరో ఘాటైన సవాలును విసిరారు.

గత ఎన్నికల్లో సింగిల్ డిజిట్ తో గెలిచిన అనిల్.. ఈసారి గెలవకుంటే రాజకీయాల నుంచి వైదొలిగుతారా? అంటూ సీరియస్ సవాలు విసిరారు. మరి.. మేకపాటి వారి సవాలుకు మాజీ మంత్రి అనిల్ ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.