Begin typing your search above and press return to search.

జగన్ సొంత ఇలాకాలో ఆ ఎమ్మెల్యే రూటు... ?

By:  Tupaki Desk   |   3 March 2022 1:30 AM GMT
జగన్ సొంత ఇలాకాలో ఆ ఎమ్మెల్యే రూటు... ?
X
కడప గడప అంటే వైఎస్సార్ ఫ్యామిలీకి కోట. అక్కడ వారి మాటే శాసనం. ఇవాళా నిన్నా కాదు, నాలుగున్నర దశాబ్దాలుగా అక్కడ రాజకీయాన్ని ఒడిసిపట్టుకున్న నేర్పూ తీర్పూ వారిదే. అలాంటి కడప జిల్లాలో ఇపుడు అపశకునాలు అనేకం పలుకరిస్తున్నాయి.

మూడేళ్ల క్రితం వైఎస్ వివేకా దారుణ హత్య ఘటన విషయంలో చుట్టుముట్టిన అనుమానాలతో పులివెందుల సహా అనేక ప్రాంతాల్లో వైసీపీకి కొత్త ఇబ్బందులు వస్తాయా అన్న చర్చ ఒక పక్కన ఉండగానే కొత్త జిల్లాల చిచ్చు కూడా రాజుకుని కంచుకోట లాంటి సీట్లకు ఎసరు పెడుతోంది.

అలా రాజంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఇపుడు సొంత పార్టీలోనే పెద్ద డౌట్లు పెట్టేస్తున్నారు. దానికి బయటకు కనబడుతున్న కారణం మాత్రం కొత్త జిల్లాల వివాదం. నిజానికి రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఉద్యమం పెద్ద ఎత్తున రాజుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మల్లికార్జున రెడ్డి కూడా అగ్రెస్సివ్ గా ఉద్యమంలో పాలుపంచుకున్నారు. రాయచోటిని జిల్లా కేంద్రం చేయడమేంటని కూడా గుస్సా అయ్యారు.

ఈ విషయంలో అసలు తగ్గేది లేదు అని కూడా ఆయన అంటున్నారు. నిజానికి రాయచోటిని కొత్త జిల్లాగా ప్రకటించడంతో రాజంపేటతో పాటు, రైల్వే కోడూరులలో కూడా అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకత వచ్చిపడింది. దానికి తోడు మూడేళ్ల వైసీపీ ఏలుబడిలో ఏపీ వ్యాప్తంగా కూడా ప్రజా వ్యతిరేకత పెరిగింది అన్న లెక్కలేవో మల్లికార్జున రెడ్డికి ఉన్నట్లున్నాయి.

దాంతో ఆయన వచ్చే ఎన్నికల నాటికి కండువాను మార్చేస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. నిజానికి మల్లికార్జునరెడ్డి రాజకీయ జీవితంలో వరసబెట్టి మూడు సార్లు గెలుస్తూ వచ్చారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే చిత్రమేంటి అంటే మూడు సార్లూ మూడు పార్టీలు అన్నమాట.
తొలిసారి 2009లో వైఎస్సార్ చలువతో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఆయన వైఎస్సార్ మరణం అనంతరం జగన్ వెంట కాకుండా కాంగ్రెస్ లోనే కొనసాగారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రుల వద్ద పలుకుబడి సంపాందించి తమకున్న వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్నారు.

ఇక 2014 నాటికి టీడీపీకి ఏపీలో ఊపు ఉందని భావించి టీడీపీలోకి చేరిపోయి అదే రాజంపేట నుంచి రెండవ మారు ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2019 నాటికి వైసీపీకి ఆదరణ ఉండడంతో ఇటు వైపు వచ్చారు.

ఇపుడు చూస్తే కొత్త జిల్లాల గొడవలు ఒక వైపు ఉంటే వైసీపీకి వచ్చే ఎన్నికలో గెలుపు అవకాశాల మీద ఆయనకు సందేహాలు ఏమైనా ఉన్నాయో ఏమో కానీ పక్క చూపులు చూస్తున్నారు అన్న ప్రచారం అయితే బయల్దేరింది. మొత్తానికి అటు వ్యాపారాలను, ఇటు రాజకీయాలను సమాంతరంగా నడిపించే మేడా మల్లికార్జున రెడ్డి రూటే సెపరేటూ అంటారు అంతా. మరి ఆయన పార్టీ మారుతారా లేదా అన్నది తెలియాలంటే కొంత కాలం పాటు వేచి చూడక తప్పదేమో.