Begin typing your search above and press return to search.

టీడీపీలో చేరి నాశ‌న‌మ‌య్యా:కోడుమూరు ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   20 Feb 2018 6:22 AM GMT
టీడీపీలో చేరి నాశ‌న‌మ‌య్యా:కోడుమూరు ఎమ్మెల్యే
X
ఓడ‌లు బండ్లు.....బండ్లు ఓడ‌లు అన్న‌ట్లుగా ఉంది ఏపీలో టీడీపీ ప‌రిస్థితి. అస‌లే తెలంగాణ‌లో `టీడీపీ టైటానిక్` మునిగిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న టీడీపీ....త‌న ఆశ‌ల‌న్నీ ఏపీపైనే పెట్టుకుంది. అందుకు త‌గ్గ‌ట్లుగానే...మొన్న మొన్న‌టివ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టీడీపీ నేత‌లు ఆడిందే ఆట‌....పాడిందే పాట అన్న చందంగా హ‌వా సాగింది. అయితే, అన్ని స‌మ‌యాలు మ‌న‌కు అనుకూలంగా ఉండ‌వు క‌దా.....వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.....గుంటూరులో నిర్వ‌హించిన ప్లీన‌రీతో టీడీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టడం ప్రారంభించాయి. అక్క‌డ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాలు మొద‌లుకొని ప్ర‌స్తుతం జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర వ‌ర‌కు .....ప్ర‌జ‌ల్లో విప‌రీతంగా పాపుల‌ర్ అయ్యాయి. జ‌గ‌న్ పాద యాత్ర ప్ర‌భంజ‌నానికి టీడీపీ అత‌లాకుత‌ల‌మయింది. ప్ర‌స్తుతం మూలిగే న‌క్క మీద తాటికాయ ప‌డ్డ‌ట్లుంది టీడీపీ ప‌రిస్థితి. ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రంతో తెగ‌దెంపులు చేసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితులు ఓ వైపు....మిత్రప‌క్ష‌మైన జ‌న‌సేన తిరుగుబాటు బావుటా ఎగ‌ర‌వేయ‌బోతున్న‌ట్లు సంకేతాలు మ‌రోవైపు.....వెర‌సి కుడితిలో ప‌డ్డ ఎలుకలా మారింది టీడీపీ ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో టీడీపీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు - తెలుగు త‌మ్ముళ్ల అసంతృప్తులు. జంప్ జిలానీలు....టీడీపీకి పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లున్నాయి. మొన్న‌టివ‌ర‌కు వైసీపీ ఎమ్మెల్యేల‌ను ఆక‌ర్షించిన చంద్ర‌బాబు....ఇపుడు త‌మ్ముళ్లు గోడ దూక‌కుండా కాప‌లా కాయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. తాజాగా, కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

వాస్త‌వానికి కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ.....వైసీపీ నుంచి గెలుపొందారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ఆక‌ర్స్ ప‌థ‌కంతో టీడీపీలోకి జంప్ చేశారు. అయితే, తాజాగా త‌న నిర్ణ‌యం ప‌ట్ల మ‌ణిగాంధీ ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు. టీడీపీలో చేరి తన రాజకీయ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నానని ఆయ‌న బాధ‌ప‌డుతున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు కోసం రూ.13.50లక్షలు చెల్లించామని, ఇప్పటికీ తమ చేతికి ఆ స‌భ్య‌త్వ‌ కార్డులు అందలేదని వాపోయారు. కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు వాటిని త‌స్క‌రించార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అవ‌స‌ర‌మైతే రాజకీయాల నుంచి తప్పుకోవడానికైనా సిద్ధ‌మ‌ని, విష్ణువర్ధన్ రెడ్డితో రాజీ పడే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చేసి టీడీపీలో చేరాన‌ని అంద‌రిలా అబద్ధాలు చెప్ప‌న‌ని, ఆత్మసాక్షిగా తాను టీడీపీకి అమ్ముడుపోయానని మణిగాంధీ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. మ‌రో 6 నెల‌ల్లో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు సంభ‌విస్తాయ‌ని మణిగాంధీ షాకింగ్ కామెంట్స్ చేశార‌ట‌. దీంతోపాటు, వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన బద్వేలు ఎమ్మెల్యే జయరాముడు త్వరలో టీడీపీకి టాటా చెప్ప‌బోతున్నార‌ని మ‌రో షాక్ ఇచ్చారు. ఈ ప‌రిణామాల‌ను చూస్తుంటే ఏపీలో టీడీపీ ప‌త‌నం ప్రారంభంమైంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. నానాటికీ జ‌గ‌న్ కు ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంద‌ని, రాబోయే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ప్ప‌క విజయం సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని అంచనా వేస్తున్నారు.