Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే స్టెప్ ఎటూ... పార్టీతో ఫుల్ గ్యాప్...?

By:  Tupaki Desk   |   26 Aug 2022 2:30 AM GMT
వైసీపీ ఎమ్మెల్యే స్టెప్ ఎటూ... పార్టీతో ఫుల్ గ్యాప్...?
X
ఆయన సొంత పార్టీలో చురుకుగానే ఉంటున్నారు. అయితే పార్టీ నేతలతో మాత్రం భారీ గ్యాప్ మెయింటెయిన్ చేస్తున్నాడు. తన పని తాను చూసుకుంటున్నారు. ఆ మధ్య జరిగిన వైసీపీ జిల్లా ప్లీనరీలో కూడా ఆయన బిగ్ సౌండ్ చేసి పార్టీ వైఖరిని నిలదీశారు కూడా. ఆయనే ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌. ఆయన బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు. 2019 ఎన్నికల్లో ఆయన నలభై వేల మెజారిటీతో దర్శి నుంచి గెలిచారు అంటే ఆయన ఊపు మామూలుగా లేదు అని అర్ధం.

అయితే ఈ జిల్లాలో దర్శికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రముఖ రాజకీయ కుటుంబంగా బూచేపల్లి వారిది ఉంది. 2004లోనే ఇండిపెండెంట్ గా బూచేపల్లి సుబ్బారెడ్డి ఇక్కడ నుంచి గెలిచి కాంగ్రెస్ లో వైఎస్సార్ తో సన్నిహితంగా మెలిగిన నాయకుడు. ఇక 2009 ఎన్నికల్లో ఆయన వారసుడిగా కుమారుడు శివప్రసాదరెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ మీదట ఆయన జగన్ పార్టీలోకి జంప్ చేశారు

ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో దర్శి నుంచి శివప్రసాదరెడ్డి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి శిద్ధా రాఘవరావు చేతిలో ఓడారు. 2019లో ఆయనకే జగన్ టికెట్ ఇవ్వాలనుకున్నా నో చెప్పేశారు. దాంతో మద్దిశెట్టి వేణుగోపాల్‌ ని తెచ్చి టికెట్ ఇచ్చారు. ఆయన భారీ మెజారిటీతో గెలిచి దర్శిలో తన పట్టుని పెంచుకుంటున్నారు. ఇక్కడ కాపులు కూడా అధికంగా ఉండడంతో మద్దిశెట్టి వేణుగోపాల్‌ కి అంతా కలసివస్తోంది

అయితే బూచేపల్లి కుటుంబానికి రాజకీయంగా పలుకుబడి ఉండడంతో మద్దిశెట్టి వేణుగోపాల్‌ ని వారి నియంత్రించాలని చూడడం, ఆయన దాన్ని అధిగమించాలని చూడడంతో అతి పెద్ద వర్గ పోరు వైసీపీలో సాగుతోంది. బూచేపల్లి వెంకాయమ్మ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. దాంతో వైసీపీ ఎమ్మెల్యే కి అన్ని రకాలైన ఇబ్బందులు ఎదురవుతున్నాయిట. మాజీ ఎమ్మెల్యేగా ఉన్న శివప్రసాదరెడ్డి దర్శిలో అంతా శాసిస్తారు అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో మద్దిశెట్టి వేణుగోపాల్‌ అధినాయకత్వంతో ఈ వివాదాల గురించి చెప్పినా పట్టించుకోకపోవడంతో విసిగిపోయారు. దాంతో ఆయన జిల్లా వైసీపీ ప్లీనరీతోనే హై కమాండ్ మీద బాణాలు వేశారు. నిధులు ఇవ్వకుండా ఎమ్మెల్యేలను గడప గడపకూ తిరగమంటే ఎలా అని కూడా నిలదీశారు. అలా హై కమాండ్ దృష్టిలో ఆయన ఇప్పటికే రెబెల్ గా ఉన్నారన్న ప్రచారం ఉంది. ఈ నేపధ్యంలో చీమకుర్తి ముఖ్యమంత్రి జగన్ వస్తే స్థానిక ఎమ్మెల్యేగా రావాల్సిన మద్దిశెట్టి వేణుగోపాల్‌ గైర్ హాజరు కావడం చర్చనీయాంశం అయింది.

అయితే మద్దిశెట్టి వేణుగోపాల్‌ వ్యూహాత్మకంగానే వ్యవహరించారు అని అంటున్నారు. ఆయన ఆ రోజున గడప గడపకు కార్యక్రమం పెట్టుకున్నారు. దాన్ని కూడా హై కమాండ్ కాదనలేని పరిస్థితి. అదే విధంగా బూచేపల్లి ఫ్యామిలీతోనే ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు ఉన్నాయి. దాంతో ఆ ఫ్యామిలీ వారి ఫంక్షన్ గా మారిన దానికి తాను ఎందుకు అటెండ్ అవాలనే ఆయన డుమ్మా కొట్టారని అంటున్నారు.

ఇక జగన్ తో బూచేపల్లి ఫ్యామిలీ సన్నిహితంగా మెలగడం కూడా ఎమ్మెల్యే వర్గీయుల చర్చకు దారితోంది. వచ్చే ఎన్నికల్లో దర్శిలో బూచేపల్లి శివప్రసాదరెడ్డి పోటీ చేయడం ఖాయం. దాంతో టికెట్ కూడా డౌట్ లో పడిన మద్దిశెట్టి వేణుగోపాల్‌ విషయంలో అనేక రకాల చర్చలు కూడా సాగుతున్నాయి. ఆయన అటు ఇటూ తిరిగి జనసేనలోకి వెళ్తారు అని కూడా అంటున్నారు. ఇక జగన్ కి అయితే దర్శిలో బూచేపల్లి ఫ్యామిలీయే కనిపిస్తుంది కాబట్టి మద్దిశెట్టి వేణుగోపాల్‌ ని పట్టించుకుంటారా అన్న మాట కూడా ఉంది.

మొత్తానికి సీఎం వచ్చినా నా రూటే సెపరేట్ అని మద్దిశెట్టి వేణుగోపాల్‌ గట్టిగానే చాటుకోవడం బట్టి చూస్తూంటే ఎమ్మెల్యే సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది మరి. త్వరలోనే బూచేపల్లిని దర్శి అదనపు ఇంచార్జిగా నియమిస్తారు అని అంటున్నారు. చిత్రమేంటి అంటే ఇదే దర్శి నుంచి 2014లో గెలిచి మంత్రి అయిన శిద్ధా రాఘవరావు, అలాగే టీడీపీ నుంచి పోటీ చేసిన కదిరి బాబూరావు కూడా ఇపుడు వైసీపీలోనే ఉన్నారు. మరి బూచేపల్లికే టికెట్ అంటే వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.