Begin typing your search above and press return to search.

రేప్ ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చిన భార్యామ‌ణి

By:  Tupaki Desk   |   11 April 2018 10:23 AM GMT
రేప్ ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చిన భార్యామ‌ణి
X
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని యోగి స‌ర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అంశాల్లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ పై ఉన్న రేప్ ఆరోప‌ణ‌ల గురించి తెలిసిందే. ఒక యువ‌తిపై అత్యాచారం చేయ‌టం.. న్యాయం కోసం చేస్తున్న పోరాటం చేస్తున్న క్ర‌మంలో వారిని వెన‌క్కి త‌గ్గాలంటూ హెచ్చ‌రించారు. ఇదేస‌మ‌యంలో బాధితురాలి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్టేష‌న్లో అత‌న్ని చిత్ర‌హింస‌ల‌కు గురి చేయ‌టం.. పోలీసుల హింస‌కు తాళ‌లేక మ‌ర‌ణించటంతో ఈ వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మార‌టంతో పాటు యోగి స‌ర్కారుకు తీవ్ర ప్ర‌తికూలంగా మారింది.

ఈ ఇష్యూపై చివ‌ర‌కు సీఎం యోగి స్పందించి.. బాధితురాలి తండ్రి మృతికి కార‌ణంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న పోలీసుల‌పై చ‌ర్య‌లు ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో రేప్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే సోద‌రుడు బాధితురాలిని వార్నింగ్ ఇస్తున్న ఆడియో క్లిప్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చి ఈ వ్య‌వ‌హారంలో ఎమ్మెల్యే ఇరుక్కుపోయేలా చేయ‌టంతో పాటు.. అధికార‌పార్టీకి ఈ ఇష్యూ పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.

ఇలాంటివేళ‌..రేప్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కుల్దీప్ స‌తీమ‌ణి సంగీత సీన్లోకి వ‌చ్చారు. తాజాగా యూపీ డీజీపీ ఓపీ సింగ్‌ను క‌లిశారు. రేప్ ఆరోప‌ణ‌లు చేస్తున్న బాధితురాలికి.. త‌న భ‌ర్త‌కు నార్కో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిందిగా ఆమె విన‌తిప‌త్రం ఇచ్చారు. అత్యాచార ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని.. త‌న భ‌ర్త‌కు న్యాయం చేయాల‌ని ఆమె కోరారు. ఈ సంద‌ర్భంగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు కొత్త త‌ర‌హాలో ఉన్నాయి. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో త‌న క‌మార్తెలు భ‌యాందోళ‌న‌ల‌కు గురి అవుతున్నార‌ని వ్యాఖ్యానించారు.

తాము మాన‌సికంగా వేధింపుల‌కు గురి అవుతున్నామ‌ని.. ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి ఆధారాలు..రుజువులు లేకుండానే త‌న భ‌ర్త‌ను మీడియా రేపిస్ట్ గా ముద్ర వేసింద‌న్నారు. త‌న భ‌ర్త కానీ.. భ‌ర్త త‌మ్ముడు కానీ.. వారి అనుచ‌రులు కానీ బాధితురాలి తండ్రి మీద దాడి చేయ‌లేద‌న్న ఆమె.. దాడి మొత్తం పోలీసుల‌దేన‌న్నారు.

త‌న భ‌ర్త‌పై చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో ఇసుమంత కూడా నిజం లేద‌ని చెబుతున్న ఆమె.. మీడియాలో వ‌స్తున్న‌వ‌న్నీ క‌ట్టుక‌థ‌లేన‌న్నారు. మీడియాలో త‌న భ‌ర్త‌కు వ్య‌తిరేకంగా క‌థ‌నాలు నిలిపివేయ‌క‌పోతే కుమార్తెల‌తో స‌హా తాము విషం తాగుతామ‌ని వార్నింగ్ ఇచ్చేశారు. మొత్తానికి రేప్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేగారి స‌తీమ‌ణి వార్నింగ్ లు కొత్త త‌ర‌హాగా ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.