Begin typing your search above and press return to search.

సీసీ ఫుటేజ్ చూపిస్తే గంట‌లో రాజీనామా

By:  Tupaki Desk   |   4 May 2018 9:53 AM GMT
సీసీ ఫుటేజ్ చూపిస్తే గంట‌లో రాజీనామా
X
రాజ‌కీయనాయ‌కుల మీద వ‌చ్చే ఆరోప‌ణ‌లు అన్నిఇన్ని కావు. అయితే.. త‌మ మీద వ‌చ్చే ఆరోప‌ణ‌ల‌కు స‌ద‌రు రాజ‌కీయ నేత స్పందించే తీరుతోనే వారేం చెప్పాల‌నుకున్నారో ఇట్టే అర్థ‌మైపోతుంది. రాజకీయంగా త‌న‌ను అప్ర‌దిష్ట పాలు చేసేందుకు వీలుగా కుట్ర సాగుతోంద‌ని మండిప‌డుతున్నారు నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే.. వైఎస్సార్ కాంగ్రెస్ నేత కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి.

ఇటీవ‌ల ఆయ‌న‌కు క్రికెట్ బుకీల‌తో సంబంధాలు ఉన్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై ఆయ‌న తీవ్రంగా స్పందించారు. తాను క్రికెట్ బుకీల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఒక‌వేళ‌.. అలాంటి ఆధారాలు ఉంటే పోలీసులు ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టాల‌ని స‌వాల్ విసిరారు. తాను ఎవ‌రికి ఫోన్ చేయలేద‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసే వారు.. వాటికి ఆధారాలు ఎందుకు చూపించ‌టం లేద‌న్నారు.

కొంద‌రు బుకీలు మంత్రుల‌తో స‌న్మానాలు చేయించుకున్నార‌ని.. వారికి సంబంధించిన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా.. పోలీసు అధికారుల‌కు మాత్రం అవేమీ క‌నిపించ‌వ‌ని మండిప‌డిన ఆయ‌న‌.. త‌న‌పై చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు ఆధారాలు చూపించాల‌న్నారు.

ఈ సంద‌ర్భంగా త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు భారీ స‌వాల్ విసిరారు. తాను క్రికెట్ బుకీల‌తో ఫోన్లో మాట్లాడిన‌ట్లుగా ఆధారాలు కానీ.. విజ‌య‌వాడ‌లోని హోట‌ల్లో కానీ.. క‌డ‌ప ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో క‌లిసిన‌ట్లుగా చెబుతున్నార‌ని.. దానికి సంబంధించిన సీసీ కెమేరా ఫుటేజీని బ‌య‌ట‌పెడితే.. గంట వ్య‌వ‌ధిలో త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తార‌ని తేల్చి చెప్పారు. మ‌రి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన‌ ఘాటు ఛాలెంజ్ కు ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు ఏ రీతిలో రియాక్ట్ అవుతారో చూడాలి.